కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: వన మహోత్సవం (Vana Mahotsavam) కేవలం అటవీశాఖ ఉత్సవము కాదని, మనందరి ఉత్సవమని, అందరూ భాగస్వాములు కావాలని జోగులాంబ, యాదాద్రి సర్కిల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శివాల రాంబాబు (Sivala Rambabu) పిలుపునిచ్చారు. మంగళవారం వన మహోత్సవం సందర్భంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో భారీ స్థాయిలో మొక్కలు నాటడంతో పాటు నీటి, మట్టి సంరక్షణకు సంబంధించిన కార్యక్రమాలను విస్తృతంగా చేపడుతున్నట్లు శివాల రాంబాబు తెలిపారు.
ఈ సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని అప్పన్నపల్లి గ్రామంలో టీబీ ఆసుపత్రి మార్గం పక్కన నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. వన మహోత్సవంలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటడంతో పాటు వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్, పెర్కొలేషన్ ట్యాంకులు, మినీ పెర్కొలేషన్ ట్యాంకులు, చెక్‌డ్యామ్‌లు తదితర నీటి, మట్టి సంరక్షణ నిర్మాణాలను చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించడంతో పాటు నేల కోతను అరికట్టేందుకు ఈ నిర్మాణాలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంతో పాటు ఫారెస్ట్ కాంప్లెక్స్‌లోనూ భారీ స్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వివిధ మున్సిపల్ ప్రాంతాల్లో కూడా మాస్ ప్లాంటేషన్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పారు.
అన్ని శాఖల సమిష్టి భాగస్వామ్యం
వన మహోత్సవం కేవలం అటవీ శాఖకు మాత్రమే పరిమితమైన కార్యక్రమం కాదని, అన్ని ప్రభుత్వ శాఖల సమిష్టి భాగస్వామ్యంతో నిర్వహిస్తున్నామని కన్సర్వేటర్ రాంబాబు తెలిపారు. గ్రామీణాభివృద్ధి శాఖ, మున్సిపాలిటీలు, పరిశ్రమల శాఖతో పాటు ఇతర ప్రభుత్వ శాఖలు కూడా విస్తృతంగా భాగస్వాములవుతున్నాయని చెప్పారు. సాధారణంగా నిర్వహించే వన మహోత్సవ కార్యక్రమాలకు అదనంగా ఈ ఏడాది భారీ స్థాయిలో మాస్ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. తన పరిధిలోని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. పలువురు ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులు, ఇతర జిల్లా స్థాయి అధికారులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని చెప్పారు.
ఉమ్మడి జిల్లాల్లో లక్షలాది మొక్కలు
మహబూబ్‌నగర్ జిల్లాలో ఒక్కరోజే దాదాపు 70 వేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టినట్లు శివాల రాంబాబు తెలిపారు. ఇందులో అటవీ శాఖతో పాటు గ్రామీణాభివృద్ధి శాఖ, మున్సిపాలిటీలు తమ పరిధిలో పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నాయని చెప్పారు. అదేవిధంగా గద్వాల జిల్లాలో సుమారు 32 వేల మొక్కలు, నారాయణపేట జిల్లాలో సుమారు 7 వేల మొక్కలు, వనపర్తి జిల్లాలో 15 వేలకుపైగా మొక్కలు నాటే కార్యక్రమాలను చేపడుతున్నట్లు వెల్లడించారు.
నాటడమే కాదు.. సంరక్షణ కూడా ముఖ్యం
వన మహోత్సవ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారని కన్సర్వేటర్ తెలిపారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ, ప్రజలందరూ వన మహోత్సవంలో భాగస్వాములై మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి పి. శ్రీనివాస్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇస్రా నాయక్, డిప్యూటీ రేంజ్ అధికారి ఎం.డి. జకిరుద్దీన్, అటవీ శాఖ అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

