కలం, జోగులాంబ గద్వాల: జోగులాంబ గద్వాల (Jogulamba Gadwal) జిల్లా కేంద్రంలో కృష్ణాజీరావు అనే వ్యక్తి ఇంట్లో మంగళవారం గ్యాస్ సిలిండర్ పేలి (Gas Cylinder Explosion) పూరి గుడిసె దగ్ధమైంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. గద్వాల పట్టణం దౌదరిపల్లిలోని పూరి గుడిసెలో కృష్ణా జీ రావు నివసిస్తున్నాడు. ఆయన మేకల కాపరిగా పని చేస్తున్నాడు. మంగళవారం ఉదయం ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. ఇంట్లో ఉన్న కృష్ణాజీ రావు భార్య జమ్ములమ్మ పూరి గుడిసెలో వంట చేస్తుండగా అకస్మాత్తుగా వంట గ్యాస్ సిలిండర్ నుంచి పైపు ఊడి బయటకు మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గమనించిన జమ్ములమ్మ వెంటనే గుడిసెలో నుంచి బయటికి రావడంతో ప్రాణాపాయం తప్పింది.
గుడిసెకు మంటలు అంటుకోవడంతో అంతటా వ్యాపించాయి. ఇది గమనించిన చుట్టు పక్కల వారు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అయినా అప్పటికే గుడిసె పూర్తిగా దగ్ధమైంది. ఇంట్లో ఉన్న రూ.1.5 లక్షలు, కొన్ని బంగారు ఆభరణాలు, బియ్యం, దుస్తులు తదితర సామగ్రి పూర్తిగా కాలిపోయాయి. దీంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. విషయం తెలుసుకున్న వార్డు కౌన్సిలర్ జగదీష్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని వార్డు కౌన్సిలర్ కోరారు. రెవెన్యూ అధికారులు పంచనామా నిర్వహించారు.

