కలం, వెబ్ డెస్క్ : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) తన విదేశీ పర్యటనలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తనకు కూడా రష్యా, కెనడా పర్యటనలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని తెలిపారు. ఇలాంటివి చాలా సార్లు జరుగుతుంటాయని.. ఒక్కోక్కరికి ఒక్కో విధానం అమల్లోకి ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ విషయాలను రాజకీయ కోణంలో చూడకూడదని సుచించారు.
రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకపోవడంపై రాజకీయ దుమారం చెలరేగుతున్న నేపథ్యంలో కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి అమెరికా టూర్ రద్దును తెలంగాణ ప్రజలకు ఆపాదించడం సరైన విషయం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ తన అమెరికా పర్యటన విషయంలో కేంద్రంపై అర్ధరహిత విమర్శలు చేస్తున్నారని విమర్శించారు.
సీఎం, కేంద్రమంత్రులు విదేశాలకు వెళ్తే.. అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే పర్యటన ఖరారు చేస్తారని కిషన్ రెడ్డి వివరించారు. యూపీఏ హయాంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ ఉన్న సమయంలో అనుమతి ఎందుకు ఇవ్వలేదో కాంగ్రెస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

