కలం, వెబ్‌డెస్క్: కొద్ది రోజులుగా సమ్మె చేస్తున్న ఏపీ జూనియర్ డాక్టర్లు (AP Junior Doctors) సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు హైకోర్టుకు జూడాలు ఓ నివేదిక అందజేశారు. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించేలా చూడాలని హైకోర్టును కోరారు. రెండు వారాల్లో జూనియర్ డాక్టర్ల సమస్యలపై నిర్ణయం తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్ట్ ఆదేశించింది. జూనియర్ డాక్టర్ల సమ్మెను సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది. సోమవారం కోర్టు జూనియర్ డాక్టర్లకు నోటీసులు పంపింది. దీంతో జూడాలు నేడు సమ్మెను విరమిస్తూ కోర్టుకు నివేదిక సమర్పించారు.
జూనియర్ డాక్టర్లు తమకు 15 శాతం స్టైఫండ్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం 5 శాతం మాత్రమే ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వం నిర్ణయంపై జూడాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు 12 నుంచి జూడాలు సమ్మెలో ఉన్నారు. ప్రభుత్వం పెంచిన స్టైఫండ్ జనవరి 1 2026 నుంచి అమలులోకి వస్తుందని ప్రకటించింది. ఆ తర్వాత ప్రతి ఏడా మరో 3 శాతం స్టైఫండ్ పెరుగతుందని వెల్లడించింది. కానీ, జూడాలు మాత్రం తక్షణమే 15 శాతం స్టైఫండ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

