కలం, కరీంనగర్: కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం గడ్డివానిపల్లిలో (Gaddivanipalli) 2019లో చోటుచేసుకున్న భూ వివాదం, దాడి కేసులో హుజూరాబాద్ కోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురికి ఐదేళ్ల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.2 వేల చొప్పున జరిమానా విధించింది.గడ్డివానిపల్లికి చెందిన ఎలవేని రఘుపతి సుమారు 35 ఏళ్ల క్రితం 18 గుంటల భూమిని కొనుగోలు చేశారు.
అయితే తన తండ్రి తమకు తెలియకుండా ఆ భూమిని విక్రయించారనే కారణంతో అదే గ్రామానికి చెందిన గడ్డి మహేష్ (ఉపసర్పంచ్), గడ్డి కొమురయ్య, గడ్డి రాజు, గడ్డి తిరుపతితో పాటు సిరిసేడు గ్రామానికి చెందిన బీనవేని ఎర్రయ్య 2019లో రఘుపతిపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రఘుపతిని కుటుంబ సభ్యులు తొలుత జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తీసుకెళ్లారు.ఘటనపై బాధితుడి కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇల్లందకుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం నిందితులపై న్యాయస్థానంలో అభియోగాలు నమోదు చేసి విచారణ కొనసాగించారు.
ఆరేళ్ల విచారణ అనంతరం తీర్పు
దాదాపు ఆరేళ్ల పాటు సాగిన విచారణలో సాక్ష్యాధారాలను పరిశీలించిన హుజూరాబాద్ కోర్టు ఐదుగురిని దోషులుగా నిర్ధారించింది. ఒక్కొక్కరికి ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.కేసు విచారణ సందర్భంగా ఇరువర్గాలను కోర్టు వాయిదాలకు క్రమం తప్పకుండా హాజరుపరిచి బాధ్యతాయుతంగా వ్యవహరించిన కోర్టు కానిస్టేబుల్ జన్నే రాజేష్‌ను హుజూరాబాద్ ఏసీపీ మాధవి, జమ్మికుంట రూరల్ సీఐ వెంకట్‌గౌడ్, ఇల్లందకుంట ఎస్సై క్రాంతికుమార్ ప్రత్యేకంగా అభినందించారు.

