కలం, ఖమ్మం బ్యూరో: భద్రాచలం పోలీసులు (Bhadrachalam Police) భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా నుంచి బెంగళూరుకు గంజాయి రవాణా చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో ఆర్టీసీ బస్టాండ్ పరిసరాల్లో ఎస్సై వి. సతీష్ తన సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. రూ.9,41,500 విలువైన 19 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ అరుణ్ కుమార్ వెల్లడించారు. విచారణలో నిందితులు యూపీకి చెందిన అజయ్ అలియాస్ అజయ్ సైని, ఉజ్వల్ అలియాస్ ఉజ్వల్ సైనిగా గుర్తించారు.
సులభంగా డబ్బు సంపాదించాలని..
సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆశతో మహమ్మద్ అష్రఫ్ ఖురేషి అనే వ్యక్తి సూచనల మేరకు సుక్మా నుంచి రెండు లగేజ్ బ్యాగుల్లో గంజాయి తీసుకుని బెంగళూరులోని సతీష్ అనే వ్యక్తికి అందించేందుకు వెళ్తున్నట్లు పోలీసుల విచారణలో అంగీకరించారు. గంజాయితో పాటు రెండు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని భద్రాచలం పట్టణ ఇన్‌స్పెక్టర్ నాగరాజు ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయం లేదా నిల్వకు పాల్పడే వారితో పాటు వారికి సహకరించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ అరుణ్ కుమార్ హెచ్చరించారు.

