కలం, హనుమకొండ: హనుమకొండ (Hanumakonda) జిల్లాలోని ఎల్కతుర్తి (Elkathurthy) తో ఓ కారు డిక్కీలో యువతి మృతదేహం లభ్యమవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసుల విచారణలో యువతిని ఆమె ప్రియుడే హత్య చేసినట్లు తేలింది. వివరాల్లోకి వెళ్తే.. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో ప్రియురాలిని గొంతు పిసికి హత్య చేసి, మృతదేహాన్ని కారులో ఎల్కతుర్తి శివారులో వదిలేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీబీ ప్రశాంత్ రెడ్డి ఈ ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.
ఈ నెల 21న ఎల్కతుర్తి (Elkathurthy) వ్యవసాయ మార్కెట్ చెక్‌పోస్ట్ సమీపంలో కారులో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకొని పరిశీలించగా డిక్కీలో మహిళ మృతదేహాన్ని గుర్తించారు. మూడు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆదివారం ఎల్కతుర్తి శివారులోని నాగార్జున సీడ్స్ వద్ద నిందితుడు ఏడెల్లి వినోద్‌కుమార్ (34)ను అదుపులోకి తీసుకున్నారు.
గోదావరిఖనికి చెందిన మానసతో వినోద్‌కు చిన్ననాటి పరిచయం ఉంది. ఈ నెల 18న కరీంనగర్‌లోని వినోద్ గదిలో మానస అతడిని కలిసింది. ఈ సమయంలో తనను పెళ్లి చేసుకోవాలని వినోద్‌ను కోరింది. దీంతో మాటా మాటా పెరిగి ఇద్దరి మధ్య గొడవకు దారి తీసింది. అనంతరం తన తండ్రి సూచనతో వినోద్ గొంతు పిసికి మానసను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని కారులో ఎల్కతుర్తికి తరలించి అక్కడే వదిలేసినట్లు వెల్లడించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీపీ ప్రశాంత్‌రెడ్డి తెలిపారు.

