వరంగల్‌లో ‘కొండా’ దంపతులకు ఎదురుగాలి.. సురేఖ బర్తరఫ్‌కు డిమాండ్!

కలం, వరంగల్‌ బ్యూరో : వరంగల్‌ తూర్పు.. కొండా కుటుంబానికి కంచుకోటగా భావించిన నియోజకవర్గం. కానీ ఇప్పుడు ఇదే గడ్డపై కొండా దంపతులకు ఎదురుగాలి మొదలైంది. ఇన్నాళ్లూ వెంట నడిచిన సొంత పార్టీ నేతలే.. ఇప్పుడు వ్యతిరేక గళం విప్పుతున్నారు. మంత్రి కొండా సురేఖ (Konda Surekha), మురళి దంపతులను బర్తరఫ్‌ చేయాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. సీఎం రేవంత్‌ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు గాను కొండా దంపతుల కూతురు సుష్మిత బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందేనని పట్టుబడుతున్నారు. మూడు రోజుల క్రితం పరకాల టికెట్‌ వ్యవహారంపై సుష్మిత చేసిన వ్యాఖ్యలతో మొదలైన వివాదం.. ఇప్పుడు కొండా కుటుంబ ఆధిపత్యం వర్సెస్‌ కాంగ్రెస్‌ క్యాడర్‌గా మారుతున్నది. ఇప్పటికే హైదరాబాద్‌లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రెస్‌మీట్‌ పెట్టి మంత్రి కొండా సురేఖ తీరును ఖండించగా.. ఇప్పుడు సొంత నియోజకవర్గం వరంగల్‌ తూర్పులోనూ పార్టీ నేతలు బహిరంగంగా ఎదురుదాడికి దిగడం కొండా కుటుంబానికి రాజకీయంగా గట్టి హెచ్చరికగా మారింది.

సుష్మిత వ్యాఖ్యలతో మొదలై..

సీఎం రేవంత్‌రెడ్డిపై సుష్మిత చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో ప్రకంపనలు సృష్టించాయి. ముఖ్యమంత్రిని సొంత పార్టీ నేతల కుటుంబ సభ్యులే టార్గెట్‌ చేయడంపై కాంగ్రెస్‌ వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమైంది. సుష్మిత వ్యాఖ్యలకు తాను బాధ్యురాలిని కాదని సురేఖ వివరణ ఇచ్చినా వివాదం మాత్రం చల్లారలేదు. పైగా పార్టీ క్రమశిక్షణపై ప్రశ్నలు తలెత్తడంతో వ్యవహారం హైకమాండ్‌కు దృష్టికి వెళ్లింది. దీంతో ‘సుష్మిత వ్యాఖ్యలు’ అనే ఒక అంశం కాస్తా.. ‘కొండా కుటుంబ రాజకీయ విధానం’పై చర్చగా మారింది.

బీసీ కార్డు.. బలమా?శాపమా?

వరంగల్‌ తూర్పులో బీసీ రాజకీయాలు ఇప్పుడు మరోసారి చర్చకు వచ్చాయి. బీసీలకు తాము అండగా ఉన్నామని చెప్పుకుంటున్న కొండా కుటుంబమే.. బీసీ నాయకత్వాన్ని ఎదగనివ్వడం లేదన్న ఆరోపణలు రావడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. బీసీలను అడ్డం పెట్టుకుని రాజకీయ పబ్బం గడుపుతున్నారన్న విమర్శలు.. అదే బీసీలను అణగదొక్కుతున్నారన్న ఆరోపణలు.. కొండా కుటుంబానికి రాజకీయంగా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. సొంత పార్టీలో ఉంటూనే సీఎం రేవంత్‌రెడ్డిపై విమర్శలు చేయడం ఇప్పుడు కొండా కుటుంబానికే రాజకీయంగా ప్రతికూలంగా మారిందన్న చర్చ మొదలైంది. సీఎంను టార్గెట్‌ చేయడం, పార్టీ నుంచి షోకాజ్‌ నోటీస్ రావడం, సొంత పార్టీ ఎమ్మెల్యేలే వ్యతిరేకించడం, మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేయడం, సొంత నియోజకవర్గంలోనూ వ్యతిరేకత రావడం.. గత మూడు రోజుల్లోనే పరిణామాలు ఇంత వేగంగా మారడం కాంగ్రెస్‌ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

కంచుకోటలోనే కల్లోలం

ఇన్నాళ్లూ తమకు తిరుగులేదని భావించిన వరంగల్‌ తూర్పులోనే ఇప్పుడు కొండా దంపతులకు సొంత పార్టీ నేతల నుంచి సవాల్‌ ఎదురవుతోంది. వ్యక్తిగత అసంతృప్తి బహిరంగ అసమ్మతిగా మారితే.. అది క్రమంగా క్యాడర్‌ తిరుగుబాటుగా మారే అవకాశాన్ని కొట్టిపారేయలేమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అయితే మరోవైపు కొండా సురేఖ వర్గం మాత్రం తమపై ఉద్దేశపూర్వకంగా దాడి చేస్తున్నారని ఆరోపిస్తోంది. దీంతో ఇరువర్గాల మధ్య వివాదం మరింత ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి.

సొంత క్యాడర్‌‌లో అసంతృప్తి

  • ఇదే సమయంలో వరంగల్‌ తూర్పులో కొండా వ్యతిరేక వర్గం ఒక్కసారిగా స్వరం పెంచింది. కొండా దంపతుల తీరుతో పార్టీకి నష్టం జరుగుతోందని కాంగ్రెస్‌ నేత నల్గొండ రమేశ్ ఆరోపించారు. బీసీలను అడ్డం పెట్టుకుని రాజకీయ పబ్బం గడుపుతూ.. అదే సామాజిక వర్గానికి చెందిన మరో నాయకత్వం ఎదగకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు.
  • నియోజకవర్గంలో ఇతర బీసీలు ఎవరూ ఎదగకుండా అణగదొక్కుతున్నారని యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు పరమేశ్‌ ఆరోపించారు. పార్టీ కోసం పని చేస్తున్న నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని, రౌడీషీట్లు తెరిపిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
  • ‘అసలు కొండా మురళికి ఏ హోదా ఉందని పరకాల టికెట్‌, కార్పొరేటర్‌ టికెట్లు ప్రకటిస్తారు? ప్రకటించడానికి ఆయనెవరు?” అంటూ మాజీ కార్పొరేటర్‌ గుండేటి నరేందర్‌ ప్రశ్నించారు. క్రమశిక్షణ లేని వారు పార్టీలో ఉండకూడదని, కొండా దంపతులను బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. “మీది ఊపు కాదు.. వాపు” అంటూ ఎద్దేవా చేశారు. కొండా దంపతులను పార్టీ నుంచి తప్పిస్తే తూర్పు కాంగ్రెస్‌ శ్రేణులు పండుగ చేసుకుంటాయంటూ వ్యాఖ్యానించారు.
  • ఇవి సాధారణ రాజకీయ విమర్శలు కావని, ఇన్నాళ్లూ కొండా కుటుంబం వెంట ఉన్న క్యాడర్‌లోనే అసంతృప్తి పెరుగుతోందనడానికి సంకేతాలని కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>