కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ (Telangana SIR) ప్రక్రియలో భాగంగా నేటి నుంచి ఓటర్లకు నోటీసుల జారీ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 17న విడుదలైన ముసాయిదా ఓటర్ల జాబితాలో గుర్తించిన అనామలీస్ (తేడాలు), మ్యాపింగ్ కాని ఓట్లు తదితర అంశాలపై ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 93 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. సంబంధిత ఓటర్ల ఇళ్లకు బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓలు) వెళ్లి నేరుగా నోటీసులు అందించనున్నారు.
గడువులోగా వివరణ ఇవ్వాల్సిందే
నోటీసులు అందుకున్న ఓటర్లు నిర్ణీత గడువులోగా తమ వివరణను సమర్పించాల్సి ఉంటుంది. గడువులోగా స్పందించని పక్షంలో సంబంధిత ఓటును తొలగించే అవకాశం ఉందని ఎన్నికల సంఘం హెచ్చరించింది. నోటీసుల జారీ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రత్యేక యాప్ను కూడా ఏర్పాటు చేశారు. ఓటరుకు నోటీసు అందించిన అనంతరం నోటీసు ఇచ్చిన ఫొటోను బీఎల్ఓలు తప్పనిసరిగా యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
రోజుకు 200 మందికి అవకాశం
ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో రోజుకు సుమారు 200 మంది ఓటర్లకు వివరణ ఇచ్చేందుకు స్లిప్పులు పంపిణీ చేయనున్నారు. ఓటర్లు తమ వద్ద ఉన్న ప్రభుత్వ గుర్తింపు కార్డుల్లో 11 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకదాన్ని చూపిస్తే సరిపోతుందని ఈసీ స్పష్టం చేసింది. నేటి నుంచి సెప్టెంబర్ 17 వరకు నెల రోజుల పాటు ఓటర్ల వివరణలు, అభ్యంతరాలు, క్లైయిమ్ లు స్వీకరిస్తారు. అక్టోబర్ 19న తుది జాబితా ప్రకటిస్తారు.
ఓల్డ్ సిటీలోనే అధికంగా సమస్యలు
ఓటర్ల పేర్లలో, ముఖ్యంగా ఇంటిపేరు, పేర్లలో తప్పులు పెద్ద సంఖ్యలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ సమస్య హైదరాబాద్ ఓల్డ్ సిటీ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో ఎక్కువ మంది ఓటర్లకు నోటీసులు జారీ కానున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మ్యాపింగ్ కాని ఓట్లు అధికంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఓటర్లందరూ నోటీసులు అందుకున్న తర్వాత నిర్ణీత గడువులోగా తమ వివరాలను పరిశీలించుకుని, అవసరమైన ఆధారాలతో వివరణ ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు.

