శ్రీలంకపై భారత్ జోరు.. పడిక్కల్ సెంచరీ!

క‌లం, వెబ్ డెస్క్‌: కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ అదరగొట్టింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 85 ఓవర్లలో 5 వికెట్లకు 300 పరుగులు చేసింది. దేవదత్ పడిక్కల్ (Devdutt Padikkal) 117 పరుగులతో మెరిశాడు. టాస్ గెలిచిన భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్ కేఎల్ రాహుల్ 18 పరుగులకే అవుటయ్యాడు. ఆ తర్వాత యశస్వి జైస్వాల్ 45 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. పడిక్కల్, గిల్ కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ఇద్దరూ కీలక భాగస్వామ్యం నెలకొల్పారు.

పడిక్కల్ 168 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. ఈ సిరీస్‌లో అతడికి ఇది వరుసగా రెండో శతకం. చివరకు 193 బంతుల్లో 117 పరుగులు చేసి అవుటయ్యాడు. అతడి ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు ఉన్నాయి. మరోవైపు గిల్ కూడా అర్ధసెంచరీ పూర్తి చేశాడు. 98 బంతుల్లో 50 పరుగులు చేశాడు. దీంతో టెస్టుల్లో భారత్ తరఫున 3 వేల పరుగుల మైలురాయిని కూడా చేరుకున్నాడు. అలాగే ఒక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్‌లో 1,000 పరుగులు చేసిన తొలి భారత కెప్టెన్‌గా నిలిచాడు. ఆ తర్వాత రిషభ్ పంత్ బ్యాటింగ్‌కు వచ్చాడు.

అయితే లహిరు కుమార బంతికి గ్లౌవ్స్‌కు దెబ్బ తగలడంతో పంత్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. అతడి స్థానంలో రవీంద్ర జడేజా క్రీజులోకి వచ్చాడు. పడిక్కల్, జడేజా కలిసి భారత్‌ను మరింత ముందుకు తీసుకెళ్లారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 66 పరుగులు జోడించారు. జడేజా 43 పరుగులు చేశాడు. అయితే చివర్లో శ్రీలంకకు అసిత ఫెర్నాండో కీలక వికెట్లు తీశాడు. పడిక్కల్, జడేజాను అతడే అవుట్ చేశాడు. 16 ఓవర్లలో 46 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.

జడేజాకు ఎడమ చేతి భాగంలో అసౌకర్యం కూడా కనిపించింది. పలుమార్లు ఫిజియో చికిత్స తీసుకున్నాడు. అయినప్పటికీ బ్యాటింగ్ కొనసాగించాడు. రోజు ఆట ముగిసే సమయానికి ధ్రువ్ జురెల్ 7 పరుగులతో, సారంశ్ జైన్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. శ్రీలంక తరఫున అసిత ఫెర్నాండో మూడు, లహిరు కుమార ఒక వికెట్ తీశారు. భారత్ తొలి రోజే 300 పరుగులు సాధించడంతో రెండో టెస్టులో మంచి స్థితిలో నిలిచింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>