తిమ్మాపూర్‌ ఎస్సారెస్పీ కెనాల్‌లో వృద్ధురాలి అనుమానాస్పద మృతి

కలం, జగిత్యాల: జగిత్యాల (Jagitial)  రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాపూర్ గ్రామంలో వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. గ్రామానికి చెందిన బడుగు దుబ్బరాజు (60) మృతదేహం గొల్లపల్లి రోడ్డులోని తిమ్మాపూర్ బస్‌స్టాప్ సమీపంలో ఉన్న ఎస్సారెస్పీ చిన్న కెనాల్‌లో లభ్యమైంది. పోలీసుల వివరాల ప్రకారం.. దుబ్బరాజు గొల్లపల్లి రోడ్డులోని హెచ్‌పీ పెట్రోల్ పంప్, తాతమ్మ గుడిలో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం సుమారు 4 గంటలకు ఇంటి నుంచి బయలుదేరి తాతమ్మ గుడికి వెళ్లి, పని ముగించుకుని ఉదయం 7 గంటల ప్రాంతంలో ఇంటికి తిరిగి వస్తుంటారు. ఎప్పటిలాగే ఆదివారం ఉదయం కూడా పనికి బయలుదేరారు.

అయితే ఉదయం సుమారు 4.20 గంటల సమయంలో తిమ్మాపూర్ బస్‌స్టాప్ సమీపంలోని మోతే బక్కన్న వ్యవసాయ పొలం వద్ద ఓ మహిళకు అరుపులు వినిపించాయి. భయంతో ఆమె ఇంటికి వెళ్లి గ్రామస్తులకు సమాచారం అందించింది. దీంతో గ్రామస్తులు అక్కడికి చేరుకుని పరిసరాల్లో గాలించగా, అక్కడ పల్సర్ మోటార్‌సైకిల్ కనిపించింది. సమీపంలోని ఎస్సారెస్పీ చిన్న కెనాల్‌లో దుబ్బరాజు మృతదేహాన్ని గ్రామస్తులు గుర్తించారు. అక్కడ ఉన్న పల్సర్ మోటార్‌సైకిల్‌ను గుర్తుతెలియని వ్యక్తులు స్టార్ట్ చేసుకుని పరారైనట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న జగిత్యాల డీఎస్పీ పురుషోత్తం, జగిత్యాల రూరల్ సీఐ సుధాకర్, ఎస్సై ఉమాసాగర్ క్లూస్ టీంతో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆధారాలను సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలి కుమార్తె బడుగు స్వప్న ఫిర్యాదు మేరకు జగిత్యాల రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. దుబ్బరాజు మృతికి గల కారణాలు, ఘటనకు పాల్పడిన వ్యక్తుల గుర్తింపు, వారి పాత్రపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతున్నట్లు జగిత్యాల రూరల్ పోలీసులు తెలిపారు.

పోలీసులు నిందితులను కఠినంగా శిక్షించాలి: మాజీ మంత్రి జీవన్ రెడ్డి

జగిత్యాల రూరల్ మండలం తిమ్మాపూర్ గ్రామ శివారులో రామక్క అనే మహిళ అనుమాదాస్పదంగా మృతి చెందడంతో సంఘటన స్థలానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి వచ్చారు. పోస్టుమార్టం అనంతరం జరిగే అంతిమ కార్యక్రమాలకు ఆర్థిక సహాయం జీవన్ రెడ్డి అందించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, సమాజంలో మానవత్వ విలువలు లేకుండా పోయాయని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు మరణించిన రామక్క ఉడుపరి పని చేస్తు జీవనం కొనసాగిస్తుందని, ఉదయం 4 గంటలకు పనికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది అని తెలుపుతున్నారని చెప్పారు. ఇలాంటి హత్యలు భవిష్యత్ లో జరగకుండా నిందితుడిని పోలీసులు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>