కలం, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని అరూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (Arrur PACS) పాలకవర్గం నియామకం చుట్టూ అల్లుకున్న సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. భువనగిరి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అన్ని పీఏసీఎస్ లకు పాలకవర్గాల నియామకాలు పూర్తయినప్పటికీ, ఒక్క అరూర్ విషయంలో మాత్రం గత కొన్ని నెలలుగా నిర్ణయం వాయిదా పడుతూ వస్తుండటం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
‘చైర్మన్’ రేసులో ఇద్దరు నేతలు?
అరూర్ పీఏసీఎస్ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ముఖ్య నాయకులు తీవ్రంగా శ్రమిస్తున్నట్టు సమాచారం. చెరో వైపు నుంచి గట్టిగా ప్రయత్నాలు ముమ్మరం చేయడంతో, ఎవరికి పదవి కేటాయించాలనే విషయంలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి అయోమయ పరిస్థితి నెలకొంది. ఎవరికిచ్చినా మరొక వర్గం అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉండటంతోనే ఈ నియామకంపై నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వస్తున్నారని సమాచారం.
కష్టపడ్డవారికే పదవా?
పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకూ, నాయకుడికి తగిన గుర్తింపు, పదవులు లభిస్తాయని కాంగ్రెస్ అధిష్ఠానం పదేపదే చెబుతున్న నేపథ్యంలో.. అరూర్ పీఠం ఎవరిని వరిస్తుందనే దానిపై మండల రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. పార్టీ పట్ల మొదటినుంచి విశ్వసనీయంగా ఉన్న నాయకుడికి ఇస్తారా లేక సమీకరణాల ఆధారంగా నిర్ణయం తీసుకుంటారా? అనేది వేచి చూడాల్సిందే. ఏది ఏమైనా, రోజురోజుకూ పెరుగుతున్న ఈ సస్పెన్స్‌కు తెరపడాలంటే ఎమ్మెల్యే వీలైనంత త్వరగా స్పందించి అరూర్ పీఏసీఎస్ పాలకవర్గాన్ని ప్రకటించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

