కలం, నిజామాబాద్ బ్యూరో: స్వేచ్ఛ ఉంది కదా అని ఇష్టారాజ్యంగా, అడ్డగోలుగా మాట్లాడితే సహించబోమని పార్టీ నేతలకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud) వార్నింగ్ ఇచ్చారు. పార్టీ లైన్ దాటి ప్రవర్తిస్తే ఎంతటి వారైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. నిజామాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పార్టీలో ఎవరికైనా బాధలు, ఇబ్బందులు ఉంటే చెప్పుకోవాలని హితవు పలికారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే వారిపై క్రమశిక్షణ కమిటీ, ఏఐసీసీలే తుది నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. సంక్షేమం, అభివృద్ధిలో కాంగ్రెస్ కు ఎవరూ సాటిరారని అన్నారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకే సహకార సంఘాల పదవుల్లో ప్రాధాన్యం ఇస్తామని అన్నారు.
కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం ఎక్కువ అని గతంలో బీఆర్ఎస్ పార్టీ నేత రాజయ్య అన్నారని.. బీఆర్ఎస్ లో ఉన్న ఈటల రాజేందర్ ను ఆ పార్టీ చీఫ్ అర్ధరాత్రి గెంటి వేశారని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. బీజేపీ నేతలు సంస్కార హీనంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. బీజేపీ నేతల ముఖానికి నిజామాబాద్ ను స్మార్ట్ సిటీ చేయలేని పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్లు నిజామాబాబ్ జిల్లాలో ఇచ్చామని గుర్తు చేశారు.
దేశంలో ఎక్కడ లేని విధంగా అభివృద్ధి, సంక్షేమం రెండింటిపై దృష్టి సారించామని టీపీసీసీ చీఫ్ అన్నారు. హైదరాబాద్ మాదిరి నిజామాబాద్ లో పైలట్ ప్రాజెక్ట్ కింద ఇందిరమ్మ టవర్స్ నిర్మిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తున్నామని వివరించారు. సహకార సంఘాల్లో కష్టపడ్డ వారికి పదవులు ఇస్తామని అన్నారు. ఓ వైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి,పార్టీ బలోపేతం చేస్తున్నామన్నారు. జిల్లా అభివృద్ధి గతంలో కాంగ్రెస్ హయంలో జరిగిందని.. YSR హయంలో తెలంగాణ యూనివర్సిటీ, కిరణ్ కుమార్ రెడ్డి హయంలో మెడికల్ కాలేజీ తెచ్చుకున్నామని చెప్పుకొచ్చారు.
కొత్తగా అధికారంలోకి వచ్చాక ఇంజనీరింగ్ కళాశాల, వ్యవసాయ కళాశాల తీసుకొచ్చామని తెలిపారు. లింబాద్రి గుట్టపై గెస్ట్ హౌస్ నిర్మాణం చేయబోతున్నట్టు వెల్లడించారు. నిజామాబాద్ మాస్టర్ ప్లాన్ పై సీఎంతో చర్చించామని అన్నారు. నిజామాబాద్ జిల్లా అభివృధి ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని.. ఆర్మూర్ లో పామాయిల్ ఇండస్ట్రీ రాబోతుందని వివరించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, డీసీసీ అధ్యక్షులు రామకృష్ణ, నగేష్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ తాహెర్భిన్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్ పాల్గొన్నారు.

