కలం, నిర్మల్ : నేరాల నియంత్రణకు కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్టు డీఎస్పీ శ్రీనివాస్ అన్నారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు నిర్మల్ (Nirmal) రూరల్ మండలం వెంగ్వాపేట్ గ్రామంలో ఆదివారం పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 83 ద్విచక్ర వాహనాలతో పాటు ఒక ఆటో, ఒక టాటా మ్యాజిక్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ.. గ్రామంలో ఎవరైనా గుర్తుతెలియని వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. యువత గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని అన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు వాహనానికి సంబంధించిన ధ్రువపత్రాలు కలిగి ఉండాలని సూచించారు. గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ రూరల్ సీఐ కృష్ణ, ఎస్సైలు లింబాద్రి, శ్రీకాంత్, గణేష్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

