కలం, వెబ్ డెస్క్ : ముంబైలోని భులేశ్వర్ ప్రాంతంలో శనివారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ‘భులేశ్వర్‌చా రాజా’ గణేశ్ విగ్రహ ఆగమన ఊరేగింపు వైభవంగా సాగుతుండగా ఊహించని విషాదం ఎదురైంది. బలరామ్ మర్చంట్ రోడ్‌లోని జయ్ అంబే చౌక్ వద్ద సుమారు 22 అడుగుల భారీ గణపతి విగ్రహం ఒక్కసారిగా భక్తులపై కూలిపోయింది (Ganesh Idol Collapse). ఈ ప్రమాదంలో భులేశ్వర్‌చా రాజా గణేశ్ మండల్ అధ్యక్షుడు సంకేత్ నెవ్షే (33), బ్రిజేష్ హేమంత్ జోషి (30) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు, స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన ఐదుగురిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన వారిలో 5, 7 ఏళ్ల ఇద్దరు చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ప్రస్తుతం బాధితులందరికీ చికిత్స అందుతోందని, వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. విగ్రహం బరువు తాళలేక, బ్యాలెన్స్ తప్పడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

