కదంతొక్కిన Gen Alpha.. విద్యారంగ సమస్యలపై నిరసన గళం

కలం, వెబ్ డెస్క్: యమునా నది తీరంలోని భట్‌పుర్వా సామూహి గ్రామంలో పాఠశాల భవన నిర్మాణం కోసం జెన్ ఆల్ఫా (Gen Alpha) విద్యార్థులు శాంతియుత నిరసన చేపట్టారు. పాఠశాల ఆవరణ బయట కూర్చున్న విద్యార్థులు తరగతి గదుల్లోకి వెళ్లేందుకు నిరాకరించారు. సంబంధిత అధికారి వచ్చి కొత్త పాఠశాల భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చే వరకు నిరసన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

పాఠశాల భవన నిర్మాణంపై ఇప్పటికే అధికారులకు ఆన్‌లైన్‌ ద్వారా పలుమార్లు సమాచారం ఇచ్చినప్పటికీ, ఎలాంటి స్పష్టమైన చర్యలు తీసుకోలేదని విద్యార్థులు ఆరోపించారు. ప్రిన్సిపల్‌ ప్రియాంక తివారీ విద్యార్థులను తరగతులకు హాజరు కావాలని పలుమార్లు కోరినా వారు వెనక్కి తగ్గలేదు. నిరసనకు సంబంధించిన దృశ్యాల్లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు కలిసి కూర్చోగా, పలువురు జాతీయ జెండాలను చేతబూని కనిపించారు.

ప్రాథమిక విద్యా మౌలిక వసతుల కోసం విద్యార్థులే నేరుగా గళం విప్పుతున్న ఘటనలకు ఇది మరో ఉదాహరణగా నిలిచింది. గతంలో హమీర్‌పూర్‌లో సుమారు 300 మంది విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు అనువైన రహదారి కోసం 6 కిలోమీటర్లు నడిచి కలెక్టరేట్‌కు చేరుకుని నిరసన తెలిపారు. లక్నోలో దాదాపు 250 మంది బాలికలు ఉపాధ్యాయుల కొరత, ప్రాథమిక సదుపాయాల కోసం ఆందోళన చేపట్టారు.

ఉన్నావ్‌లోనూ 200 మందికి పైగా విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి మొహన్‌-బంగార్మౌ మార్గాన్ని దిగ్బంధించినట్లు సమాచారం. ఢిల్లీలో Gen-Z విద్యార్థులు సమ్మెలు, ఆందోళనల ద్వారా తమ సమస్యలను వినిపిస్తుండగా.. ఉత్తరప్రదేశ్‌లో Gen Alpha విద్యార్థులు తమ సమస్యలను నేరుగా రోడ్లపైకి వచ్చి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నారు.

 Also Read : టాక్సిక్ ఈవెంట్ నిర్లక్ష్యం: మల్లారెడ్డి యూనివర్సిటీపై కేసు నమోదు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>