గ్రాండ్ చెస్ లీగ్: ఫైనల్ పోరులో దూసుకెళ్తున్న ప్రజ్ఞానంద!

కలం, స్పోర్ట్స్: భారత చెస్ సంచలనం, గ్రాండ్‌మాస్టర్ ఆర్‌. ప్రజ్ఞానంద (Praggnanandhaa) గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్స్‌లో అదరగొడుతున్నారు. సెంట్ లూయిస్‌లో జరుగుతున్న ఈ టోర్నీ సెమీఫైనల్లో ఆయన జర్మనీ ఆటగాడు విన్సెంట్ కీమర్‌తో తలపడనున్నారు. ఈ పోరులో గెలిచిన విజేత నేరుగా ఫైనల్‌కు చేరుకుంటారు. ఓడిన ఆటగాడు మూడో స్థానం కోసం పోటీ పడాల్సి ఉంటుంది. సింక్విఫీల్డ్ కప్ ముగిసే సమయానికి ప్రజ్ఞానంద 35.5 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచారు. ప్రస్తుతం లైవ్ రేటింగ్స్‌లో భారతదేశం తరఫున ప్రజ్ఞానందనే అగ్రస్థానంలో ఉన్నారు. ఆయన ఈ టోర్నీలో చివరి నాలుగు దశకు చేరుకోవడం ఇది మొదటిసారి కాదు.

గత ఏడాది కూడా సెమీస్ చేరినా.. రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయి నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నారు. మరో సెమీఫైనల్ పోరు అమెరికా ఆటగాళ్లు ఫాబియానో కరువానా, వెస్లీ సో మధ్య జరగనుంది. ఈ టోర్నీలో కరువానా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్నారు. ఈ టోర్నీని క్లాసికల్, రాపిడ్, బ్లిట్జ్ అనే మూడు వేర్వేరు ఫార్మాట్లలో నిర్వహిస్తున్నారు. పోటీ ప్రారంభంలో ఆటగాళ్లు రెండు క్లాసికల్ గేమ్‌లు ఆడతారు. ప్రతి గెలుపునకు 6 పాయింట్లు, డ్రా అయితే చెరో 3 పాయింట్లు ఇస్తారు. ఆ తర్వాత రెండు రాపిడ్ గేమ్‌లు జరుగుతాయి. రాపిడ్ గెలుపునకు 4 పాయింట్లు దక్కుతాయి.

చివరిగా నాలుగు బ్లిట్జ్ గేమ్‌లు ఆడతారు. దీనిలో ప్రతి విజయం 2 పాయింట్లు అందిస్తుంది. ఓడిపోయిన వారికి ఎలాంటి పాయింట్లు లభించవు. మొత్తం 28 పాయింట్లలో ఎవరైతే ముందుగా 15 పాయింట్లు సాధిస్తారో వారు ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. ఈ టోర్నీ మొత్తం ప్రైజ్ మనీ 4,50,000 అమెరికన్ డాలర్లుగా నిర్ణయించారు. విజేతగా నిలిచే ఆటగాడు 2,00,000 డాలర్ల నగదు బహుమతిని గెలుచుకుంటారు. అలాగే ఈ టోర్నీలో తొలి మూడు స్థానాల్లో నిలిచే ఆటగాళ్లకు తదుపరి ఏడాది జరిగే గ్రాండ్ చెస్ టూర్‌కు నేరుగా ప్రవేశం లభిస్తుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>