కలం, వెబ్డెస్క్: లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి సిక్కు మతస్తుల నుంచి తీవ్ర నిరసన ఎదురైంది. శనివారం సాయంత్రం ఢిల్లీలోని ఆయన ఇంటి ముందు సిక్కులు ఆందోళన నిర్వహించారు. 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో దోషిగా తేలిన సజ్జన్ కుమార్ (Sajjan Kumar)ను కొందరు కాంగ్రెస్ నేతలు హీరో అని, రోల్ మోడల్ అని అభివర్ణించడంపై సిక్కులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబాలతో సహా రాహుల్ ఇంటి ముట్టడికి బయలుదేరారు. సజ్జన్ కుమార్ గురువారం మృతి చెందిన నేపథ్యంలో పలువురు కాంగ్రెస్ నేతలు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ చేసిన ప్రకటనలపై సిక్కు సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది.
ఢిల్లీలోని సిక్కు గురు ద్వారా మేనేజ్ మెంట్ అధ్యక్షుడు హర్మీత్ సింగ్ కల్కా, ప్రధాన కార్యదర్శి జగదీప్ సింగ్ కహ్లోన్ నేతృత్వంలో ఈ నిరసన చేపట్టారు. రాహుల్ ఇంటి వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిరసనకారులు ప్లకార్డులు, రాహుల్ సహా పలువురు కాంగ్రెస్ నేతల దిష్టిబొమ్మలు పట్టుకొని వాటిని చెప్పులతో కొడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

