అక్రమాలకు చెక్ పెట్టడమే వాచ్‌డాగ్ కమిటీ లక్ష్యం: రాజేందర్ రావు

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో అవినీతికి అడ్డుకట్ట వేయడంతో పాటు ప్రజలకు పారదర్శకమైన పాలన అందించేందుకు కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు (Velichala Rajender Rao) సరికొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టనున్నారు. నగరంలో తొలిసారిగా యువతను భాగస్వామ్యం చేస్తూ ‘జెన్–జీ విజిలెన్స్ వాచ్‌డాగ్ కమిటీ’ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. కరీంనగర్ మైత్రి హోటల్‌లో శనివారం మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సన్న, కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, సర్పంచులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, కాంగ్రెస్ నాయకులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో రాజేందర్‌రావు ఈ కీలక ప్రకటన చేశారు.

అవినీతిపై ప్రజలే ‘వాచ్‌డాగ్’

నగరపాలక సంస్థలో జరుగుతున్న అభివృద్ధి పనులు, ఇంజనీరింగ్ పనులు, టౌన్ ప్లానింగ్ వ్యవహారాలపై నిరంతరం పర్యవేక్షణ ఉండేలా 40 నుంచి 50 మందితో ప్రత్యేక విజిలెన్స్ వాచ్‌డాగ్ కమిటీని ఏర్పాటు చేస్తామని రాజేందర్‌రావు తెలిపారు. ఈ కమిటీలో యువ లాయర్లు, ఆర్టీఐ కార్యకర్తలు, ఐటీ ప్రొఫెషనల్స్‌తో పాటు ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న యువతను ఎంపిక చేస్తామని చెప్పారు. “అవినీతిని చూస్తూ ఊరుకునే పరిస్థితి ఇక ఉండదు. ప్రజల డబ్బుతో చేపట్టే ప్రతి అభివృద్ధి పనికి లెక్క ఉండాలి. ప్రతి పనిపై ప్రజలకు సమాచారం అందుబాటులో ఉండాలి” అని ఆయన స్పష్టం చేశారు.

ఆర్టీఐతో సమాచారం.. క్షేత్రస్థాయిలో తనిఖీలు

నగరపాలక సంస్థ చేపడుతున్న అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలను ఆర్టీఐ ద్వారా సేకరించి, వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామని తెలిపారు. ఏ డివిజన్‌లో ఏ పని మంజూరైంది? ఎంత నిధులు కేటాయించారు? టెండర్ విలువ ఎంత? పనులు ఎక్కడ జరుగుతున్నాయి? నాణ్యత ఎలా ఉంది? బిల్లులు ఎలా చెల్లించారు? వంటి అంశాలను పరిశీలిస్తామని చెప్పారు. పేపర్లపై ఒకలా.. క్షేత్రస్థాయిలో మరోలా ఉండే పరిస్థితులకు చెక్ పెట్టడమే వాచ్‌డాగ్ కమిటీ లక్ష్యమని పేర్కొన్నారు.

టౌన్ ప్లానింగ్‌పై ప్రత్యేక నిఘా

కరీంనగర్ నగరంలో పెద్ద పెద్ద కాంప్లెక్సులు, వాణిజ్య భవనాలు, ఇతర నిర్మాణాలకు సంబంధించిన అనుమతులపై కూడా వాచ్‌డాగ్ కమిటీ ప్రత్యేక దృష్టి సారిస్తుందని రాజేందర్‌ రావు తెలిపారు. సాంక్షన్‌డ్ ప్లాన్, నిర్మాణం జరిగిన తీరు, అనుమతులకు విరుద్ధంగా డివియేషన్లు ఉన్నాయా? తదితర అంశాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తామని చెప్పారు. “అనుమతి ఒకటి.. నిర్మాణం మరొకటి అనే పరిస్థితి ఉండకూడదు. నిబంధనలు అందరికీ సమానంగా వర్తించాలి” అని అన్నారు.

‘చైన్ గ్యాంగ్’ వ్యవహారాలపైనా నిఘా

నగరపాలక సంస్థలో చైన్‌మెన్‌లు, డ్రైవర్లు, రిటైర్డ్ ఉద్యోగులు తదితరుల ద్వారా అవినీతి వ్యవహారాలు సాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయని రాజేందర్‌రావు పేర్కొన్నారు.
అలాంటి ఆరోపణలు, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, మధ్యవర్తిత్వ వ్యవహారాలపై కూడా వాచ్‌డాగ్ కమిటీ దృష్టి సారిస్తుందని చెప్పారు. “ఎవరైనా అధికారిక వ్యవస్థను అడ్డుపెట్టుకుని ప్రజలను ఇబ్బంది పెడితే.. ఆ వ్యవహారాన్ని కూడా పరిశీలిస్తాం. ప్రజలకు ఇబ్బంది కలిగించే ఏ వ్యవహారాన్నీ వదిలిపెట్టం” అని అన్నారు.

ఏసీబీ తలుపు తట్టడం ఆందోళనకర పరిణామం

ఇటీవల నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించిన విషయాన్ని ప్రస్తావిస్తూ రాజేందర్‌రావు స్పందించారు. “టౌన్ ప్లానింగ్ విభాగం వద్దకు ఏసీబీ అధికారులు వచ్చే పరిస్థితి ఏర్పడిందంటే.. అక్కడ సమస్య ఎంత తీవ్రమైనదో ప్రజలు అర్థం చేసుకోవాలి. అవినీతికి తావులేని వ్యవస్థను తీసుకురావాల్సిన అవసరం ఉంది” అన్నారు.

ప్రధాన చౌరస్తాల్లో ‘వాచ్‌డాగ్’ నంబర్లు

ప్రజలు నగరపాలక సంస్థ అధికారులతో లేదా టౌన్ ప్లానింగ్ విభాగంతో ఇబ్బందులు ఎదుర్కొంటే వెంటనే సమాచారం అందించేలా ప్రత్యేక వ్యవస్థను రూపొందిస్తామని రాజేందర్‌రావు తెలిపారు. వాచ్‌డాగ్ కమిటీ సభ్యుల సంప్రదింపు నంబర్లను నగరంలోని ప్రధాన చౌరస్తాల్లో హోర్డింగుల ద్వారా ప్రదర్శిస్తామని చెప్పారు. అవసరమైన హోర్డింగుల ఏర్పాటుకు తన సొంత ఖర్చుతో ముందుకు వస్తానని తెలిపారు. వెలిచాల ప్రజా కార్యాలయం ద్వారా కూడా ఈ కార్యక్రమంపై విస్తృత ప్రచారం నిర్వహిస్తామని చెప్పారు. అలాగే ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ తదితర సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తామని తెలిపారు.

‘క్లీనింగ్ ఆపరేషన్’కు శ్రీకారం

నగరపాలక సంస్థలో ప్రజలకు ఇబ్బందులు కలిగించే వ్యవహారాలను గుర్తించి, వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా ‘క్లీనింగ్ ఆపరేషన్’ నిర్వహిస్తామని రాజేందర్‌రావు ప్రకటించారు. టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాల్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా పారదర్శకమైన విధానాలను తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.

బీఆర్‌ఎస్ కంటే బీజేపీ పాలనలో అవినీతి ఎక్కువ..

కరీంనగర్ నగరపాలక సంస్థలో గత బీఆర్‌ఎస్ పాలకుల కంటే ప్రస్తుతం బీజేపీ పాలకుల హయాంలో అవినీతి వ్యవహారాలు మరింత పెరిగినట్లు తమకు సమాచారం వస్తోందని రాజేందర్‌రావు ఆరోపించారు. “ఎవరు అధికారంలో ఉన్నా అవినీతికి కాంగ్రెస్ వ్యతిరేకమే. ప్రజల డబ్బు దుర్వినియోగం కాకూడదు. పాలకులు మారినా వ్యవస్థలో పారదర్శకత రావాలి” అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో తెలంగాణను అన్ని రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాజేందర్‌రావు తెలిపారు. ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమానంగా అందించడంతో పాటు పాలనలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు.

సీఎంపై విమర్శలు చేస్తే సహించేది లేదు

మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను రాజేందర్‌రావు తప్పుబట్టారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం లేకపోయినా ముఖ్యమంత్రి, మంత్రిపై అనుచితంగా విమర్శలు చేయడం సరికాదన్నారు. “రెండు మూడు సార్లు ఇదే విధంగా వ్యవహరించారు. ముఖ్యమంత్రిని విమర్శిస్తే మాత్రం సహించేది లేదు. ప్రజల ముందు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సుస్మిత క్షమాపణలు చెప్పాలి” అని డిమాండ్ చేశారు.

22ఏ భూముల సమస్యకు త్వరలో పరిష్కారం

కరీంనగర్‌లో 22ఏ నిషేధిత భూముల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని రాజేందర్‌రావు తెలిపారు. రేకుర్తి, విద్యానగర్, కొత్తపల్లి ప్రాంతాలకు సంబంధించి దాదాపు 140 సర్వే నంబర్లలో సుమారు వెయ్యి ఎకరాల వరకు భూములు 22ఏ నిషేధిత జాబితాలోకి వెళ్లినట్లు బాధితులు తన దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో బాధిత కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, పిల్లల చదువులు, వివాహాలు, ఇతర అవసరాలకు కూడా డబ్బు సమకూర్చుకోలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఈ సమస్య తన దృష్టికి వచ్చిన వెంటనే సుమారు 300 మంది బాధితులను వెలిచాల ప్రజా కార్యాలయానికి పిలిపించి వారి సమస్యలను స్వయంగా విన్నానని రాజేందర్‌రావు తెలిపారు.

అనంతరం సమస్య పరిష్కారం కోసం జగిత్యాలకు వెళ్లి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటిని కలిసి వినతిపత్రం అందజేశానని చెప్పారు. మంత్రి సానుకూలంగా స్పందించి జిల్లా కలెక్టర్‌కు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారని తెలిపారు. 22ఏ సమస్యపై జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాతో రెండుసార్లు మాట్లాడానని రాజేందర్‌రావు తెలిపారు. కలెక్టర్ కూడా సానుకూలంగా స్పందించారని, ఈ అంశంపై సీసీఎల్‌ఏ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నామని హామీ ఇచ్చారని చెప్పారు. “ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా స్థాయిలో ఈ సమస్య పరిష్కారానికి చర్యలు కొనసాగుతున్నాయి. అతి త్వరలోనే 22ఏ బాధితులకు పరిష్కారం లభిస్తుందనే నమ్మకం ఉంది” అని రాజేందర్‌రావు అన్నారు.

వేల ఎకరాల భూముల చిక్కుముడి విప్పుతాం

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రవ్యాప్తంగా వేల ఎకరాల భూములు 22ఏ నిషేధిత జాబితాలోకి వెళ్లాయని రాజేందర్‌రావు ఆరోపించారు. ఆ సమస్యలన్నింటినీ ఒక్కొక్కటిగా పరిష్కరించి బాధితులకు ఉపశమనం కల్పించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. “22ఏ సమస్య పరిష్కారమైతే వేలాది కుటుంబాలకు ఆర్థిక ఉపశమనం లభిస్తుంది. ఈ సమస్యను కేవలం ఒక భూ సమస్యగా చూడడం లేదు.. కుటుంబాల భవిష్యత్తుతో ముడిపడిన సమస్యగా చూస్తున్నాం. పరిష్కారం లభించే వరకు బాధితులకు అండగా ఉంటాం” అని రాజేందర్‌రావు స్పష్టం చేశారు.

కొత్త రాజకీయ కార్యాచరణకు నాంది

కరీంనగర్ కార్పొరేషన్‌లో అవినీతిని అరికట్టేందుకు యువత, ఆర్టీఐ కార్యకర్తలు, న్యాయవాదులు, ఐటీ నిపుణులను కలుపుకొని ‘జెన్–జీ వాచ్‌డాగ్’ ఏర్పాటు చేస్తామన్న వెలిచాల రాజేందర్‌రావు ప్రకటన రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రజలు ఫిర్యాదు చేయడం మాత్రమే కాదు.. ప్రజల తరఫున వ్యవస్థను పరిశీలించే ఒక పౌర నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నది ఈ కొత్త కాన్సెప్ట్ లక్ష్యం అని రాజేందర్‌రావు పేర్కొన్నారు. “అవినీతిని ప్రశ్నించే గొంతుకకు భయపడాల్సిన అవసరం లేదు.. అవినీతి చేసే వారే భయపడాలి. కరీంనగర్‌ను పారదర్శకమైన, బాధ్యతాయుతమైన నగరంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం” అని ఆయన స్పష్టం చేశారు.

ఈ విలేకరుల సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న, కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు గుమ్మడి రాజకుమార్, భాస్కర్ నాయక్, ఆకుల నందిని ఉదయ్, విక్రమ్, సికిందర్, కళ్లేపల్లి శారద బాలరాజు, గంట శ్రీనివాస్, సర్పంచులు కమలాకర్ గౌడ్, తిరుపతిరెడ్డి, బోగొండ ఐలయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మీసాల శంకర్, జగ్గానీ కనకయ్య, ఎండి ఖాజా రావనవేని సంపత్, కాంగ్రెస్ నాయకులు గండి రాజేశ్వర్, మూల కృష్ణారెడ్డి, గసికంటి కుమార్, సముద్రాల రమణారావు, వేల్పుల వెంకటేష్, అనంతుల రమేష్, జల్లోజు శ్రీనివాస్, పత్యం రాజేష్, వేముల శ్రీనివాసు, సలీం తిప్పారపు శ్రీనివాస్, కపిల్ మాధవ్, కనకరాజు, వెలిచాల యువసేన జిల్లా అధ్యక్షుడు కాసారపు కిరణ్ కుమార్, గండి గణేష్ ఉపసర్పంచ్ కాశీపాక రాకేష్, సలీం, చిందం శ్రీనివాస్ యువజన కాంగ్రెస్ నాయకుడు కోహెడ వేణు, మీసా రమాదేవి కర్రె పావని, పోరండ్ల రమేష్ సత్తినేని శ్రీకాంత్, 22 ఏ భూ బాధితుల ఐక్యవేదిక అధ్యక్షుడు పాషా మోహన్ రెడ్డి, రేకుర్తి మాజీ ఉపసర్పంచ్ గొల్ల కృష్ణయ్య, సుధీర్ రెడ్డి, పలువురు కాంగ్రెస్ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>