కలం, నాగర్ కర్నూల్: ప్రజా సమస్యలు సత్వరం పరిష్కారం కావాలనే లక్ష్యంతో పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupally Krishna Rao) కొల్లాపూర్ (Kollapur) నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. వరుసగా మూడో రోజు నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి.. ఒకవైపు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూనే, మరోవైపు ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు.
క్రీడా మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించినట్లు మంత్రి తెలిపారు. విద్యార్థులు, యువతలో క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించడంతో పాటు గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేలా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో స్టేడియాల నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా శనివారం పెంట్లవెల్లిలో స్టేడియం నిర్మాణానికి ప్రతిపాదించిన స్థలాన్ని మంత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
కొల్లాపూర్ పట్టణంతో పాటు వీపనగండ్ల, పానగల్ మండలం కేతపల్లి గ్రామం, కోడేరు, పెద్దకొత్తపల్లి మండలాల్లో స్టేడియాల నిర్మాణానికి కసరత్తు కొనసాగుతోందని తెలిపారు. ఈ ప్రక్రియ వివిధ దశల్లో ఉందని, అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం పెంట్లవెల్లి మండల కేంద్రంలో ప్రజా సమస్యలపై అధికారులతో మంత్రి చర్చించారు. ప్రజలు, రైతులు తమ సమస్యలను మంత్రికి వివరించగా.. ఆయన ఓపికగా విని వాటి పరిష్కారానికి అధికారులకు సూచనలు చేశారు. ప్రధానంగా రెవెన్యూ సమస్యలపై పలువురు రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. మ్యూటేషన్ల కోసం దీర్ఘకాలంగా మండల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతుల సమస్యలపై మంత్రి జూపల్లి తీవ్రంగా స్పందించారు. ఏళ్ల తరబడి ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవడం సరికాదని అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాలకు వస్తే సత్వరం పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. రెవెన్యూ సమస్యలను పెండింగ్‌లో ఉంచకుండా ప్రత్యేక కార్యాచరణ రూపొందించి, నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
జవాబుదారీతనంతో పనిచేయాలని, సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం, జాప్యాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని, క్షేత్రస్థాయిలోనే పరిష్కారానికి చర్యలు తీసుకోవడమే తన పర్యటనల ఉద్దేశమని మంత్రి తెలిపారు. 25 ఏళ్లకు పైగా రాజకీయాల్లో ఉన్నానని, ఏ రోజు ఎక్కడా అవినీతికి పాల్పడలేదని, ఇంచు భూమి కూడా కబ్జా చేయలేదని, ఏ పనికీ ఒక్క పైసా తీసుకోలేదని అన్నారు.
ప్రజల సమస్యల పరిష్కారానికి నిబద్ధతతో పనిచేస్తున్నానని, అందుకే ప్రజలు సుదీర్ఘకాలంగా తనను ఆశీర్వదిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా మరింత బాధ్యతగా పనిచేస్తానని మంత్రి స్పష్టం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని, క్షేత్రస్థాయిలోనే పరిష్కారానికి చర్యలు తీసుకోవడమే తన పర్యటనల ఉద్దేశమని తెలిపారు.

