పాప్‌కార్న్ హెల్దీ ఫుడ్డా.. జంక్ ఫుడ్డా? నిపుణులు ఏమంటున్నారంటే?

కలం, వెబ్ డెస్క్: పాప్‌కార్న్‌ (Popcorn) ను పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ముఖ్యంగా సినిమా థియేటర్‌కు వెళ్లినప్పుడు పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు. అయితే ఇది ఆరోగ్యానికి మంచిదేనా? అసలు పాప్‌కార్న్ అనేది హెల్దీ ఫుడ్డా లేదా జంక్ ఫుడ్డా .. అనే సందేహాలు చాలామందిలో ఉంటాయి. దీని గురించి ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పడు తెలుసుకుందాం.

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పాప్‌కార్న్ అనేది సంపూర్ణ తృణ ధాన్యం. నూనె, ఉప్పు ఎక్కువగా వాడకుండా సరైన పద్ధతిలో తింటే ఇది ఆరోగ్యకరమైన స్నాక్‌గా (Health Benefits) ఉపయోగపడుతుందని చెబుతున్నారు. పాప్‌కార్న్‌లో ఫైబర్, ప్రొటీన్, మెగ్నీషియం, ఫాస్పరస్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయట. దీనిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియకు సక్రమంగా జరగడానికి ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఇది పేగుల ఆరోగ్యాన్ని కాపాడటంలో కూడా సహాయపడుతుందట.

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది

అంతేకాకుండా పాప్‌కార్న్‌ నెమ్మదిగా జీర్ణం అవుతుంది. దీంతో తిన్న తర్వాత ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగి తరచూ ఏదో ఒకటి తినాలనే కోరిక తగ్గుతుందని చెబుతున్నారు. పాప్‌కార్న్ సంపూర్ణ తృణధాన్యం కాబట్టి ఇందులో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఈ ఫైబర్ మనం తిన్న ఆహారం త్వరగా అరిగిపోకుండా చూస్తుందట. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా వేగంగా పెరగకుండా అదుపులో ఉంటాయని చెబుతున్నారు.

కానీ పాప్‌కార్న్‌కు చక్కెర, క్యారమెల్ లేదా స్వీట్ ఫ్లేవర్స్ ఎక్కువగా కలపడం వల్ల ఈ ప్రయోజనం పూర్తిగా తగ్గిపోతుందట. కాబట్టి షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచుకోవాలనుకునేవారు సాదా పాప్‌కార్న్ తినడం ఉత్తమమని సూచిస్తున్నారు.

కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో..

పాప్‌కార్న్‌లో ఉండే కరిగే పీచు పదార్థం శరీరంలోని అదనపు కొలెస్ట్రాల్‌ను గ్రహించి, దానిని సహజంగా బయటకు పంపించడంలో కీలక పాత్ర పోషిస్తుందట. ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి తోడ్పడుతుందని చెబుతున్నారు.

కానీ పాప్‌కార్న్ తయారుచేసేటప్పుడు ఎక్కువ మొత్తంలో వెన్న, వంట నూనె, ఉప్పు కలిపితే అందులోని శాచురేటెడ్ ఫ్యాట్స్ వల్ల కొలెస్ట్రాల్ తగ్గే అవకాశం పోగా, రివర్స్‌లో పెరిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు. కాబట్టి నూనె, వెన్న లేని ఎయిర్ పాప్డ్ పాప్‌కార్న్ తినడం ఉత్తమమని చెబుతున్నారు.

యాంటీఆక్సిడెంట్ల నిధి

పాప్‌కార్న్‌లో ఫెరూలిక్ యాసిడ్ వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్​కలంగా ఉంటాయట. ఇవి శరీర కణాలను దెబ్బతీసే ఫ్​రీ రాడిక‌ల్స్‌తో పోరాడి శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడి వల్ల కలిగే నష్​టాన్ని తగ్గించడంలో సహాయపడతాయట.

పాప్‌కార్న్‌ తయారుచేసేటపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

పాప్‌కార్న్‌ తినే విధానంపై దాని ఆరోగ్య ప్రయోజనాలు ఆధారపడి ఉన్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. పాప్‌కార్న్‌ను ఆరోగ్యకరంగా తినాలనుకునేవారు నూనె. ఉప్పు, వంటనూనె చాలా తక్కువగా ఉపయోగించాలట. బటర్, చక్కెర, ఉప్పు, కృత్రిమ ఫ్లేవర్లు వాడకుండా తయారు చేసుకోవాలి. వీటిని ఎక్కువగా కలపడం వలన పాప్‌కార్న్‌లో కేలరీలు, కొవ్వు, సోడియం స్థాయిలు పెరుగుతాయని సూచిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>