కలం, కరీంనగర్: విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ పై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు వాస్తవాలకు దూరంగా, డొల్లతనంగా ఉన్నాయని మున్నూరు కాపు కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి (Bomma Sriram) మండిపడ్డారు. ఈ మేరకు శుక్రవారం కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, పీసీసీ ప్రధాన కార్యదర్శి రెహమత్ హుస్సేన్ తో పలువురు నాయకులతో కలిసి కరీంనగర్ (Karimnagar)లోని తన నివాసంలో శ్రీరామ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పేద, బలహీన వర్గాల పిల్లల భవిష్యత్తు మారాలంటే విద్యే ఏకైక మార్గమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే చెబుతున్నారని అన్నారు. అందుకు అనుగుణంగానే ప్రభుత్వం రూ.2,400 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ కు కేటాయించి, అందులో రూ.2,050 కోట్లు తక్షణమే విడుదల చేసిందని తెలిపారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వేల కోట్ల బకాయిలు పెండింగ్ లో పడ్డాయని, అర్హత – అనర్హత, నిధుల దుర్వినియోగంపై అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. అందుకే రైతుబంధు తరహాలో విద్యార్థుల ఖాతాల్లోకే నేరుగా నిధులు జమ చేసే కొత్త విధానాన్ని ప్రభుత్వం తీసుకువస్తోందని, ఇది విద్యార్థుల భవిష్యత్తుకు రక్షణ కల్పించే చారిత్రాత్మక నిర్ణయమని అన్నారు. ఫీజు బకాయిల కారణంగా కళాశాలలు సర్టిఫికెట్లు నిలిపివేయడం వల్ల విద్యార్థుల ఉన్నత విద్య, ఉద్యోగ, విదేశీ అవకాశాలు దెబ్బతింటున్నాయని గుర్తించిన ప్రభుత్వం, ఫీజు బకాయిలున్నా పరీక్షలు ముగిసిన వెంటనే సర్టిఫికెట్లు ఇవ్వాలని కళాశాలలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన గొప్ప చారిత్రక పథకమన్నారు. విమర్శలు చేస్తున్న బీజేపీ నేతలు ముందు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ పథకం ఎక్కడ అమలవుతోందో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయడం, విద్యార్థులకు జర్మన్, జపనీస్ భాషల్లో శిక్షణ ఇచ్చి అంతర్జాతీయ ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రభుత్వ లక్ష్యమన్నారు. NTA వైఫల్యాలపై కేంద్రం సమాధానం చెప్పాలని.. తెలంగాణలో శాంతియుత వాతావరణం ఉందని, రాజకీయ ఉనికి కోసం విద్యార్థులను వాడుకోవద్దని హితవు పలికారు.
కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యులు అంజన్ కుమార్ మాట్లాడుతూ.. 12 ఏళ్లుగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని, ఏటా 2 కోట్ల ఉద్యోగాల హామీ ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రానికి ఇస్తున్న నిధులు, సెంట్రల్ GST ద్వారా వెళ్తున్న నిధులపై కేంద్ర మంత్రి, స్థానిక ఎంపీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. అమృత్ పథకం కింద నిధుల వరద తెస్తానన్న కేంద్ర మంత్రి ఎన్ని వరదలు తెచ్చారో చెప్పాలని, గత పథకాలకు పేర్లు మార్చి స్మార్ట్ సిటీ నిధులంటూ గొప్పలు చెప్పుకోవడం సరికాదన్నారు. కరీంనగర్ ఆర్.ఓ.బి నిర్మాణం ఏడాది గడిచినా పూర్తి కాకపోవడం వల్ల రోగులు, అంబులెన్స్ లు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కేంద్ర, రాష్ట్ర నిధుల పేరుతో ఆరోపణలు మాని వెంటనే బ్రిడ్జి పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, పీఎం ఆవాస్ యోజనలో కేంద్ర-రాష్ట్ర వాటాలను స్పష్టం చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో నాయకులు MD తాజ్, వెన్నం రజిత రెడ్డి, మాదాసు శ్రీనివాస్, చింతల్ కిషన్, కూడలి శ్రీధర్, అబ్దుల్ రెహమాన్, అమీర్, కుంభాల రాజు కుమార్, సామ్రాట్, బొమ్మ రాతి సాయి పాల్గొన్నారు.

