రీసర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం: మంత్రి పొంగులేటి

కలం, కరీంనగర్ బ్యూరో: భూ రీసర్వే ద్వారా రాష్ట్రంలోని అన్ని భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపెందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) తెలిపారు. అలాగే రీ సర్వే ఏడాదిన్నార లోపు పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి కులం, మతం, రాజకీయాలకు అతీతంగా ఇందిరమ్మ ఇల్లు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.

శుక్రవారం జగిత్యాల పట్టణంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్‌లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ , జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సి.సి.ఎల్.ఏ. కమిషనర్ లోకేష్ కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజీవ్ గాంధీ హనుమంతు, హౌసింగ్ ఎం.డి. గౌతమ్, వెలమ సంక్షేమ సంఘం కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడ నరసింగరావు, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తదితరులతో కలిసి మంత్రి పాల్గొన్నారు.

ఈ సందర్బంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యమని అన్నారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తోందని, సంక్షేమ కార్యక్రమాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు

రూ.32 కోట్లతో సౌకర్యాలు..

గత ప్రభుత్వం నూకలపల్లి 2బీహెచ్‌కే కాలనీలో అవసరమైన మౌలిక వసతుల కల్పనపై నిర్లక్ష్యం చేసిందని మంత్రి అన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి దశలో రూ.32 కోట్లతో తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ తదితర సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. రెండో దశలో పాఠశాల ఏర్పాటు కోసం త్వరలోనే నిధులు విడుదల చేస్తామని చెప్పారు.

నూకలపల్లి 2బీహెచ్‌కే కాలనీలో రేషన్ దుకాణం ఏర్పాటు చేయాలని, బస్సు సౌకర్యం కల్పించాలని జిల్లా కలెక్టర్‌ను మంత్రి ఆదేశించారు. కాలనీలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసేందుకు కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. 2008లో పునాది వేసిన కాలనీలో 18 సంవత్సరాల తర్వాత ప్రజలకు అవసరమైన సౌకర్యాలతో ఇళ్లు అందించగలిగామని చెప్పారు. ఏడాదిన్నరలోపు వ్యవసాయ భూములతో పాటు ఆబాది ఆస్తుల రీ సర్వేను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.

తొలి దశలో ప్రతి జిల్లాలో 70 గ్రామాలు..

రాష్ట్రంలో తొలి దశలో ప్రతి జిల్లాలో 70 గ్రామాలను ఎంపిక చేసి భూ రీ సర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు. జగిత్యాల జిల్లాలో కూడా ఎంపిక చేసిన గ్రామాల్లో రీ సర్వే కొనసాగుతోందన్నారు. రీ సర్వే అనంతరం అర్హులైన రైతులందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. నకిలీ పాస్ పుస్తకాలను గుర్తించి రద్దు చేస్తామని తెలిపారు.

గత ప్రభుత్వ హయాంలో రైతుబంధు ప్రయోజనాలు పొందేందుకు అర్హత లేని వారికి, నకిలీ పాస్ పుస్తకాల ఆధారంగా ప్రయోజనాలు అందిన పరిస్థితులు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. భూ రీ సర్వే అనంతరం నిజమైన రైతుల హక్కులను పరిరక్షిస్తూ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని తెలిపారు.

రూ.72 కోట్లు మంజూరు..

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూకలపల్లి 2బీహెచ్‌కే కాలనీలో పెండింగ్ పనులు పూర్తి చేసి మౌలిక వసతులు కల్పించేందుకు రూ.72 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. తాగునీరు, డ్రైనేజీ తదితర మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో పాత, ప్రస్తుతం వినియోగంలో లేని ట్రాక్టర్ ఉన్న కారణంగా కొందరు అర్హులు నష్టపోతున్నారని తెలిపారు. అలాంటి అర్హులైన కుటుంబాలకు నిబంధనల్లో సడలింపు కల్పించాలని రెవెన్యూ మంత్రిని కోరినట్లు తెలిపారు. ధర్మపురి ప్రజల చిరకాల కోరిక అయిన రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని, ధర్మపురిలో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం మంజూరు చేయాలని మంత్రి పొంగులేటిని కోరినట్లు వెల్లడించారు.

చర్చ్, ఆలయం, మసీదు ఏర్పాటు చేయాలి..

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. నూకలపల్లి 2బీహెచ్‌కే కాలనీలో తాగునీరు, విద్యుత్ సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం రూ.18 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. కాలనీలో రహదారులు, చర్చ్, ఆలయం, మసీదు, రేషన్ దుకాణం తదితర సౌకర్యాలను ఏర్పాటు చేయాలని మంత్రిని కోరారు. నూకలపల్లి కాలనీని మున్సిపాలిటీలో విలీనం చేయడానికి చర్యలు తీసుకుంటున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. టీఆర్ నగర్, నూకలపల్లిని జగిత్యాల పట్టణంలో విలీనం చేయాలని కోరారు.

జిల్లాలోని సుమారు 100 మంది సీనియర్ జర్నలిస్టుల కోసం జర్నలిస్టు కాలనీ ఏర్పాటు చేయాలని, భీంపూర్ నూతన మండలానికి తహసీల్దార్ కార్యాలయం మంజూరు చేయాలని, రాయికల్ మున్సిపాలిటీకి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు చేయాలని,జగిత్యాల పట్టణ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని మంత్రి శ్రీనివాస్ రెడ్డిని ఎమ్మెల్యే సంజయ్ కోరారు.

రూ.5 లక్షల చొప్పున పరిహారం

కార్యక్రమం ముగింపులో చెరువులో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందిన ఇద్దరు చిన్నారుల కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల చొప్పున మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరిహారం అందజేశారు. అనంతరం 12 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి పట్టాలను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వం పల్లి సత్యనారాయణ, ఎమ్మెల్సీ ఎల్ రమణ, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, అదనపు కలెక్టర్ రాజ గౌడ్, జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంఘనభట్ల దినేష్, జగిత్యాల, మెట్‌పల్లి, కోరుట్ల ఆర్డీవోలు మధుసూదన్, నరసింహారావు, జీవాకర్ రెడ్డి, జగిత్యాల మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణి, ధర్మపురి మున్సిపల్ చైర్మన్ నాగజ్యోతి, మెట్‌పల్లి మున్సిపల్ చైర్మన్, కోరుట్ల మున్సిపల్ చైర్మన్, రాయికల్ మున్సిపల్ చైర్మన్, ఆయా మండలాల ప్రజా ప్రతినిధులు, జిల్లా స్థాయి అధికారులు, సంబంధిత అధికారులు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>