డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో అక్రమాల పర్వం!: పట్టించుకోని పాలకులు

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ప్రతి మనిషికి కూడు, గూడు, గుడ్డ అందించాలనే ప్రభుత్వ లక్ష్యం నీరుగారి పోతుంది. రాజకీయాలు ,అధికారుల ఉదాసీన వైఖరితో లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నారు. పేదవాడికి సొంతింటి కలను నిజం చేయాలని ప్రభుత్వాశయం కొందరి తప్పిదాల మూలంగా తప్పు దారి పడుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్ రూముల (Double Bedroom Houses ) నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అప్పటినుండి నేటి వరకు డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు ట్రబుల్స్ మాత్రమే ఎదుర్కొంటున్నారు.

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా సుమారు పదివేల నుంచి 12 వేల డబుల్ బెడ్ రూమ్ ల నిర్మాణానికి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినా, అందులో కేవలం 50 శాతం కూడా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు పూర్తి చేయకపోవడం చూస్తుంటే ఈ పథకం పై ప్రభుత్వాలకు ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుంది. ముఖ్యంగా మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో అప్పట్లో ఓ చక్రం తిప్పిన మంత్రి తన ఇష్టానుసారంగా వ్యవహరించడం మూలంగానే అర్హులైన చాలామంది పేదవారికి ఇల్లు దక్కలేదని ఆరోపణలు వినబడుతున్నాయి.

డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ఎంపికలో అధికారుల ప్రమేయం అంతంత మాత్రమే ఉండడంతో రాజకీయాలు రాజ్యమేలి అనర్హులకు ఇల్లు దక్కడం లేదనే వాదన ఉంది. గత ప్రభుత్వంలోనూ, ప్రస్తుత ప్రభుత్వంలోనూ చాలామంది అర్హులు ఈ విషయంపై అధికారులకు, రాజకీయ నాయకులకు ఫిర్యాదులు చేసినప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడం శోచనీయం.

డబ్బులకు డబుల్ బెడ్ రూం ఇల్లు

గత బీఆర్ఎస్ ప్రభుత్వం పారదర్శకంగా అర్హులకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేశామని చెబుతున్నప్పటికీ కొంతమంది దళారులు మూడు నుంచి ఐదు లక్షల రూపాయల వరకు ఒక్కో డబుల్ బెడ్ రూమ్ ఇల్లును అమ్ముకున్నారని తెలిసింది. ఈ మేరకు గత నాలుగేళ్ల క్రితమే ఆరు మందిని అరెస్టు చేసి 13 లక్షల అరవై వేల నగదును పోలీసులు రికవరీ చేశారు. అలాగే 40 నకిలీ పట్టా సర్టిఫికెట్లు ప్రింటర్లు సైతం స్వాధీనం చేసుకున్నారు. 36 మంది నకిలీ పట్టా సర్టిఫికెట్లతో ఇండ్లు దక్కించుకున్నారని గతంలోనే పోలీసులు నిర్ధారించారు. 36 మంది బాధితుల నుండి రూ 67 లక్షల 37 వేల రూపాయలు వసూలు చేశారని పోలీసులు నిర్ధారించారు. అలాగే దివిటిపల్లి లో 1024, వీరన్న పేటలో 660 డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎవరికి ఇచ్చారు అనేది నేటికి స్పష్టత లేదు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత కూడా ఇలాంటి విషయాలను పట్టించుకోకపోవడంతో ప్రజల నుండి పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది. సర్వేనెంబర్ 523 లో ఇంటి స్థలం పొందిన లబ్ధిదారులు అప్పటి మంత్రి సూచన మేరకు పట్టా సర్టిఫికెట్లన్నీ ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ఇంటి స్థలం పట్టా కలిగిన వారందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తామని చెప్పడంతో వారంతా ప్రభుత్వానికి అప్పగించారు. అయినా అందులో నేటికి సగం మందికి కూడా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు దక్కలేదు. వీరంతా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సాధన సమితి పేరిట కొన్ని సంవత్సరాలుగా పోరాటాలు చేస్తున్న ఫలితం దక్కడం లేదు.

పేదల ముసుగులో బడా బాబులు

పేదలకు దక్కాల్సిన ఇళ్లలో బడా బాబులు తిష్ట వేసి కూర్చొన్న కూడా ప్రభుత్వం చర్యలకు దిగకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. బీపీఎల్ (దారిద్ర రేఖకు దిగువన) కింద అర్హత ఉందంటూ చెప్పుకొని రాజకీయ పలుకుబడితో పట్టాలు సంపాదించిన కొంతమంది పెద్ద బిల్డింగులని నిర్మించారు. ఇదంతా ప్రస్తుత ప్రభుత్వం చూస్తూ ఉన్న ఏమీ అనకపోవడం తో మరికొందరు పట్టాలు లేకుండానే బిల్డింగులు నిర్మిస్తున్నారు. సర్వే నెంబరు 25 లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్న జిల్లా ఉన్నతాధికారులకు తెలిసినా, పట్టించుకోవడంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా కొంతమంది వ్యవహరిస్తున్న స్థానిక ఎమ్మెల్యే సైతం పట్టించు కోవడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. గత పదేళ్లుగా డబుల్ బెడ్ రూమ్ ల కోసం ఎదురుచూస్తున్న అర్హులకు ప్రభుత్వాల తీరుతో నిరాశే ఎదురైంది. సర్వే నెంబర్ 25 లో చాలామంది పట్టా సర్టిఫికెట్లు లేకుండానే తమకు నచ్చిన ప్రదేశంలో ఇల్లు నిర్మించుకుంటున్నారు. ఈ విషయమై ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని, అందుకే తాము ఈ నిర్ణయానికి వచ్చామని కొంతమంది బాహాటంగానే చెబుతున్నారు. ఇప్పటికైనా అర్హులకు మాత్రమే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు దక్కే విధంగా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో కోర్టులను సైతం ఆశ్రయించక తప్పదని హెచ్చరిస్తున్నారు.

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>