కలం, వెబ్ డెస్క్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ అధిష్ఠానం, పీసీసీని కోరనున్నట్లు ప్రభుత్వ విప్ వేముల వీరేశం (Vemula Veeresham) పేర్కొన్నారు. ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ ఉంటూనే అధినాయకత్వానికి నష్టం కలిగించేలా వ్యవహరించే వ్యక్తులకు పార్టీలో కొనసాగే నైతిక హక్కు లేదని ఆయన ధ్వజమెత్తారు. కొండా సురేఖకు ఈ వ్యవహారంతో సంబంధం లేకపోతే, సీఎంపై ఆమె కూతురు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఇప్పటివరకు ఎందుకు ఖండించలేదని ఆయన ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడానికి సీఎం రేవంత్ రెడ్డి రాత్రింబవళ్లు ఎంతో కష్టపడ్డారని వేముల వీరేశం గుర్తుచేశారు. సమంత అంశంతో సహా పలు విషయాల్లో కొంతమంది మాట్లాడుతున్న తీరు, ఉపయోగిస్తున్న భాష పార్టీకి నష్టం కలిగించేలా ఉందన్నారు. పార్టీకి నిరంతరం తలనొప్పిగా మారిన అలాంటి వ్యక్తులను తక్షణమే తొలగించాలని, దీనిపై ఏఐసీసీ, పీసీసీలకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఏవైనా విభేదాలు, సమస్యలు ఉంటే పార్టీ అంతర్గత సమావేశాల్లోనే మాట్లాడుకోవాలని, సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు సంబంధిత వ్యక్తులు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు ఎంతమాత్రం చూస్తూ ఊరుకోరని ఆయన హెచ్చరించారు.

