కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అమెరికా పర్యటన రద్దయింది. ఈ పర్యటనకు కేంద్ర ప్రభుత్వం పొలిటికల్ క్లియరెన్స్ నిరాకరించినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. రాజకీయ కారణాలతోనే అనుమతి తిరస్కరించినట్లు స్పష్టం చేసింది. దాంతో సీఎం తన అమెరికా పర్యటనను రద్దు చేసుకుని, లండన్ నుంచి ఆగస్టు 23న హైదరాబాద్‌కు తిరిగిరానున్నారు.
హైదరాబాద్‌ను గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దడం, యువతకు అంతర్జాతీయ విద్యా అవకాశాలు కల్పించడమే తమ పర్యటన ముఖ్య ఉద్దేశమని సీఎం తెలిపారు. తాను వెళ్లలేకపోయినా, అధికారిక బృందం షెడ్యూల్ ప్రకారం అమెరికాలో పర్యటిస్తుందని స్పష్టం చేశారు. హార్వర్డ్, ఎంఐటీ, నార్త్‌ఈస్టర్న్, వర్జీనియా టెక్ వంటి ప్రముఖ విద్యాసంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవాలని అధికారులకు సూచించారు.
యువత భవిష్యత్తు కోసం రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, లండన్‌లో తన పర్యటన యథావిధిగా కొనసాగుతుందని సీఎం తెలిపారు. అక్కడ ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, లండన్ బిజినెస్ స్కూల్ ప్రతినిధులతో సమావేశమై కీలక భాగస్వామ్యాలపై చర్చించనున్నారు. “తెలంగాణ రైజింగ్ ఆగదు” అని ఈ సందర్భంగా ఆయన ధీమా వ్యక్తం చేశారు.

