కలం, ఖమ్మం బ్యూరో: హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ రైల్ నిలయంలో గురువారం నిర్వహించిన దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) ఎంపీల సమావేశంలో రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర (MP Vaddiraju) పాల్గొన్నారు. తెలంగాణలోని పలు రైల్వే సమస్యలపై జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవకు వినతిపత్రం అందజేశారు. తెలంగాణలో సికింద్రాబాద్ జోన్ పరిధిలో హైదరాబాద్ ఒక్కటే డివిజన్‌గా ఉందని గుర్తుచేస్తూ, కాజీపేట జంక్షన్‌తో పాటు భద్రాచలం రోడ్ (కొత్తగూడెం) స్టేషన్‌ను నూతన రైల్వే డివిజన్లుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
భద్రాచలం రోడ్ స్టేషన్ నుంచి భద్రాచలం క్షేత్రానికి నేరుగా రైలు మార్గాన్ని విస్తరించి, దానిని ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అనుసంధానించాలని వివరించారు. దీనివల్ల ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. కొత్తగూడెం నుంచి తిరుపతికి ప్రత్యేక రైలును కేటాయించాలన్నారు. సికింద్రాబాద్–బెల్గావి ఎక్స్‌ప్రెస్‌ను తిరిగి మణుగూరు వరకు పొడిగించి, కాజీపేట్–మణుగూరు ప్యాసింజర్‌ను వెంటనే పునరుద్ధరించాలని కోరారు.
అమృత్ భారత్ పథకం కింద ఖమ్మం రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలన్నారు. అక్కడ ప్రైవేట్ పార్కింగ్ కంటే ఎక్కువగా వసూలు చేస్తున్న పార్కింగ్ రుసుములను నియంత్రించాలని కోరారు. మధిర స్టేషన్‌లో రూ.25.4 కోట్ల పనులతో పాటు 4వ ప్లాట్‌ఫామ్ నిర్మించాలని డిమాండ్ చేశారు.
గతంలో నిలిపివేసిన గౌతమి, పద్మావతి, నవజీవన్, అమృత్ భారత్ సహా పలు ఎక్స్‌ప్రెస్ రైళ్ల హాల్టింగ్‌లను మధిర, మహబూబాబాద్, గార్ల, కేసముద్రం, నెక్కొండ స్టేషన్లలో తిరిగి పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. నిజామాబాద్ బైపాస్ లైన్ ఏర్పాటుపై తిరిగి సమీక్షించి, అశోక ఎన్ క్లేవ్ ప్లాట్లదారులకు నష్టం జరగకుండా చూడాలన్నారు. మధిర దెందుకూరు వద్ద పట్టా భూముల్లో ఉన్న హద్దు రాళ్లను తొలగించాలని జీఎంను ఎంపీ వద్దిరాజు కోరారు.

