కలం, ఖమ్మం బ్యూరో: పోడు భూముల్లో (Podu Lands) ఫారెస్ట్ అధికారులు కందకాలు తవ్వడం, మొక్కలు నాటడం తక్షణమే నిలిపివేయాలని సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ డిమాండ్ చేసింది. చర్ల మండలంలోని గిరిజనాదివాసీల పోడు భూములను లాక్కునే ప్రయత్నం చేస్తే ప్రాణాలర్పించడానికైనా సిద్ధమేనని స్పష్టం చేసింది. ఈ మేరకు గురువారం చర్ల ఫారెస్ట్ రేంజర్ రజితకు పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ ముసలి సతీశ్ నేతృత్వంలో వినతిపత్రం అందించారు.
రాజ్యాంగంలోని 5వ, 6వ షెడ్యూళ్లు, పేసా చట్టం, 1/70 చట్టం, అటవీ హక్కుల చట్టాల ప్రకారం గిరిజనులకు రక్షణ ఉన్నప్పటికీ, ఫారెస్ట్ అధికారులు చట్టాలను ఉల్లంఘిస్తూ పంటలను ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. అధికారులు తమ వైఖరి మార్చుకోకపోతే ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంతపూరి సురేశ్, గొంది ముయన్న, కుంజ జోగారావు, మడకం సమ్మక్క, ఇర్ప ప్రసాద్, తెల్లం పెంటమ్మ పాల్గొన్నారు.

