కలం, నిర్మల్: నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండలంలోని నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్యను తీవ్రంగా ఖండిస్తూ నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలో ట్రస్మా (TRSMA) ఆధ్వర్యంలో శుక్రవారం ప్రైవేటు పాఠశాలల బంద్ (Private Schools Bandh) నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. విద్యారంగంలో ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్ లు, పాఠశాల యాజమాన్యాలపై దాడులు జరగడం ఆందోళనకరమని పేర్కొన్నారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్ లకు భద్రత కల్పించాలని కోరారు. రూపారెడ్డి కుటుంబానికి న్యాయం జరిగేలా నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు నిరసనగా జిల్లాలో శుక్రవారం నిర్వహించే ప్రైవేటు పాఠశాలల బంద్ ను అన్ని పాఠశాలల యాజమాన్యాలు విజయవంతం చేయాలని కోరారు.

