కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చేది అధిష్ఠానం మాత్రమేనని, వారు తప్ప ఎవరూ ప్రకటించినా అవి చెల్లదని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) స్పష్టం చేశారు. టికెట్ల కేటాయింపు విషయంలో పార్టీకి ఒక విధానం ఉందని, అదే అనుసరిస్తుందని వివరించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సిఫార్సుల మేరకు మాత్రమే అభ్యర్థుల ప్రకటన ఉంటుందన్నారు. కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, సీఎంపై అలా మాట్లాడటం సరికాదన్నారు.
వివరణ ఇచ్చాకే..
కొండా సుస్మిత వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు జారీ చేశామని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. ఆమె నుంచి వివరణ వచ్చాక, తదుపరి చర్యలు ఎలా ఉండాలో క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుందన్నారు. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డిపై చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా సరికావన్నారు. ఆయన చాలా సీనియర్ నాయకులు అని, పార్టీ లైన్ దాటితే ఎవరిపై అయినా క్రమశిక్షణ చర్యలు తప్పవని వెల్లడించారు.

