కలం, ఖమ్మం బ్యూరో: ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయం (Khammam Politics) మరోసారి తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. నిన్నటివరకు ఒకే వేదికపై చిరునవ్వులు చిందించిన కాంగ్రెస్, సీపీఐ నేతల మధ్య ఇప్పుడు ఆధిపత్య చదరంగం మొదలైంది. అసెంబ్లీ ఎన్నికలు హస్తం, కంకి-కొడవలి మిత్రబంధం ఒక్కటి కాగా, అదే బంధం ఇప్పుడు కొత్తగూడెం, పినపాక వేదికలుగా ఎత్తులకు పైఎత్తులు వేస్తూ చెక్-మేట్ రాజకీయానికి తెరతీశాయి.
పొంగులేటి వర్సెస్ కూనంనేని
ఈ ఆధిపత్య పోరుకు కేంద్ర బిందువుగా కొత్తగూడెం నియోజకవర్గం నిలిచింది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులో భాగంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఇక్కడి నుండి ఘనవిజయం సాధించారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి అక్కడ సమీకరణాలు వేగంగా మారాయి. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గం నియోజకవర్గంలో జోక్యం పెంచుకోవడమే కాకుండా, అధికారిక కార్యక్రమాల్లో ప్రొటోకాల్‌ను పక్కనబెట్టి సొంత అనుచరులను ప్రోత్సహిస్తోందని సీపీఐ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. భవిష్యత్తు రాజకీయం కోసం అక్కడ కాంగ్రెస్ ‘కర్చీఫ్’ వేసేందుకు ప్రయత్నిస్తోందని భావించిన కూనంనేని, ఏమాత్రం తగ్గకుండా కౌంటర్ వ్యూహానికి తెరలేపారు.
ఆ కంచుకోటపై సీపీఐ కన్ను
మిత్రపక్షమే తన సొంత గడ్డపై ఆధిపత్యం చెలాయించాలని చూడటంతో, దెబ్బకు దెబ్బ తీయాలని కూనంనేని నిశ్చయించుకున్నారు. పొంగులేటి కోటను దెబ్బతీసేందుకు ఆయన ఆప్తుడైన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న పినపాక నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. పినపాకలో పాయం రాజకీయ పునాదులను కదిలించడం ద్వారా పొంగులేటిని డిఫెన్స్‌లో పడేయడమే కూనంనేని వేసిన పక్కా వ్యూహం. చారిత్రకంగా 1962 నుండి 2004 వరకు సీపీఐ ఇక్కడ 5 సార్లు జయకేతనం ఎగరేసిన చరిత్ర ఉండటంతో, తమ పాత కోటను మళ్లీ సాధించుకుంటామని సీపీఐ శంఖారావం పూరిస్తోంది.
మరోవైపు పినపాకలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పరిస్థితి రోజురోజుకూ అగమ్యగోచరంగా మారుతోంది. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగ కాంతారావు వరుస వివాదాల్లో చిక్కుకోవడంతో ఆ పార్టీ కేడర్ కన్ఫ్యూషన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ బీఆర్ఎస్ వైఫల్యాల వల్ల రాబోయే రోజుల్లో పినపాకలో ప్రధాన పోరు కాంగ్రెస్ వర్సెస్ సీపీఐ మధ్యే జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సీపీఐకి ఉన్న సాంప్రదాయ ఓటు బ్యాంకు, ఎస్టీ ఏజెన్సీ పరిధిలోని పట్టు కూనంనేని హెచ్చరికలకు బలాన్నిస్తున్నాయి.
కాంగ్రెస్‌కు సవాల్
రాబోయే రోజుల్లో జిల్లాలో కనీసం రెండు స్థానాల్లో గెలుస్తామని, అవసరమైతే పినపాక నుంచి ఒంటరిగానే బరిలోకి దిగుతామని కూనంనేని చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌కు సవాల్‌గా మారాయి. కూనంనేని విసిరిన ఈ సవాల్‌పై పొంగులేటి వర్గం మౌనంగా ఉంటూనే తన పని తాను చేసుకుపోతోంది. కాంగ్రెస్ అధిష్ఠానం మాత్రం ఈ విభేదాలు రచ్చకెక్కకుండా సైలెంట్‌గా ఉంది. పినపాక వేదికగా మొదలైన ఈ ‘మిత్ర’ యుద్ధం మున్ముందు ఏ మలుపు తిరుగుతుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని సర్దుబాటు చేస్తారో లేక సీపీఐ నిజంగానే ఒంటరి పోరుకు సిద్ధపడుతుందా అనే చర్చ కొనసాగుతోంది. మరోవైపు అధికార బలం, పొంగులేటి నెట్వర్క్ ముందు కూనంనేని వ్యూహం ఏ మేరకు వర్కౌట్ అవుతుందో, ఈ ‘మిత్ర’ యుద్ధంలో చివరికి విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే.

