కలం, నిర్మల్: రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ‘రాబరీ మినిస్టర్’గా మారారని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే (Nirmal MLA) ఏలేటి మహేశ్వర్‌రెడ్డి (Alleti Maheshwar Reddy) తీవ్ర విమర్శలు చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మంత్రి కాకముందు ఉన్న ఆస్తులు ఎంత.. ప్రస్తుతం ఉన్న ఆస్తులు ఎంత అని ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. లక్షల కోట్ల విలువైన భూములను 22(ఎ) జాబితాలో చేర్చి పెద్ద ఎత్తున భూదందాకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మంత్రి, ప్రభుత్వానికి మధ్య ఫీనిక్స్ కంపెనీ మధ్యవర్తిగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
గతంలో ఫీనిక్స్ కంపెనీ బీఆర్ఎస్కు బినామీ సంస్థగా పనిచేస్తోందని ఆరోపించిన కాంగ్రెస్ నేతలే ఇప్పుడు అదే సంస్థతో కలిసి బ్రోకర్లుగా మారారని ఏలేటి ఆరోపించారు. ఫీనిక్స్ కంపెనీ నుంచి రాఘవ కన్స్ట్రక్షన్స్కు, అక్కడి నుంచి మంత్రి పొంగులేటికి చెందిన వివిధ కంపెనీలకు సుమారు రూ.15 వేల కోట్ల విలువైన ఆస్తులు బదిలీ అయ్యాయని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తనతో బహిరంగ చర్చకు రావాలని ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సవాల్ విసిరారు. తాను చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయని, వాటిపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
తన శాఖలో తప్పులు జరిగాయని మంత్రి స్వయంగా అంగీకరించి క్షమాపణ కోరుతున్నప్పుడు నైతిక బాధ్యత వహించి ఎందుకు రాజీనామా చేయడం లేదని ప్రశ్నించారు. తప్పులకు బాధ్యులైన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకునే ధైర్యం ప్రభుత్వానికి ఉందా అని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమాన్ని పక్కనపెట్టి రియల్ ఎస్టేట్ వ్యవహారాలకే ప్రాధాన్యం ఇస్తోందని ఏలేటి (Nirmal MLA) విమర్శించారు.
పేదల భూములను కాపాడాల్సిన ప్రభుత్వమే భూకబ్జాదారులకు సహకరిస్తోందని ఆరోపించారు. భూ వ్యవహారాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన వారందరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఈ అంశంపై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని ఏలేటి మహేశ్వర్‌రెడ్డి హెచ్చరించారు.
Also Read : ప్రాతినిధ్యం సున్నా.. తెలంగాణ బీజేపీకి బిగ్ షాక్!
Follow Us On: X(Twitter)

