24 గంటల విద్యుత్‌ ఎక్కడ ఇస్తున్నారో చూపించే దమ్ముందా?

కలం, నార్కట్‌పల్లి: నార్కట్‌పల్లి పట్టణంలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌ను నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య (Chirumarthi Lingaiah) ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడి లాగ్‌బుక్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విద్యుత్ సరఫరా తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ప్రభుత్వంలో నాణ్యమైన విద్యుత్ కంటే మెరుగైన ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దారుణంగా మోసం చేసిందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోతల వల్ల పంటలు ఎండిపోతున్నాయన్నారు. లోవోల్టేజీ కారణంతో మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతూ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

సరైన విద్యుత్ లేక పంటలు నష్టపోయి రైతులు అప్పుల పాలవుతున్నారని పేర్కొన్నారు. తనిఖీ సమయంలో సబ్‌స్టేషన్‌ లాగ్‌బుక్‌లో విద్యుత్ రాకపోకల వివరాలను సక్రమంగా నమోదు చేయకపోవడంపై మండిపడ్డారు. బీఆర్‌ఎస్ నాయకులు తనిఖీకి వస్తున్నారని తెలిసి కూడా రికార్డులను సరిగా నిర్వహించకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోందన్నారు. “24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని ప్రగల్భాలు పలుకుతున్న కాంగ్రెస్ నాయకులకు, రాష్ట్రంలో ఎక్కడైనా 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా అవుతున్న ప్రాంతాన్ని చూపించే దమ్ముందా?” అని చిరుమర్తి లింగయ్య సవాల్ విసిరారు.

రైతులకు నిరంతర విద్యుత్ అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి విద్యుత్ సరఫరాలో ఉన్న సాంకేతిక సమస్యలను పరిష్కరించాలన్నారు. రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రజల పక్షాన బీఆర్‌ఎస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని చిరుమర్తి స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>