కూసుకుంట్లకు చండూరు మున్సిపల్ చైర్మన్‌ సవాల్‌

కలం, మునుగోడు: చండూరు మున్సిపాలిటీలో అవినీతి ఆరోపణలపై మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు (Kodi Srinivasulu) మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాను ఎక్కడైనా ఒక్క రూపాయి తీసుకున్నట్లు నిరూపిస్తే మున్సిపల్ చైర్మన్ పదవికి రాజీనామా చేసి రాజకీయాలకు శాశ్వతంగా దూరమవుతానని సవాల్ విసిరారు. అదే విధంగా తనపై ఆరోపణలు చేస్తున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కూడా తాను రాజకీయాల నుంచి తప్పుకునేందుకు సిద్ధమా అని ప్రశ్నించారు. మంగళవారం చండూరు మున్సిపాలిటీ కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో కోడి శ్రీనివాసులు మాట్లాడారు.

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై బీఆర్ఎస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై వాస్తవాలను ప్రజలకు వివరించకుండా రాజకీయ లబ్ధి కోసం ఆరోపణలు చేయడం సరికాదన్నారు. చండూరు ప్రజలు కొన్ని దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న బస్సు షెల్టర్ నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ సహకారం అందిస్తున్నారని తెలిపారు.

ప్రజల కోరిక మేరకు బస్సు షెల్టర్ నిర్మిస్తుంటే మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి (Kusukuntla Prabhakar Reddy) దాన్ని ఓర్వలేక అవసరం లేదని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మున్సిపాలిటీలో వైన్ షాపుల వద్ద, పండ్ల బండ్ల వ్యాపారుల వద్ద, ప్రైవేట్ ఆస్పత్రుల వద్ద, కాంట్రాక్టర్ల వద్ద, రియల్ ఎస్టేట్ వ్యాపారుల వద్ద తాను లక్షల రూపాయలు తీసుకున్నానని ఆరోపణలు చేస్తున్నారని కోడి శ్రీనివాసులు (Kodi Srinivasulu) పేర్కొన్నారు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని దేవుడి ముందు ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు.

మున్సిపాలిటీ పాలకవర్గంలోని సభ్యులంతా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. తాను డబ్బులు తీసుకున్నట్లు ఆధారాలతో నిరూపిస్తే చైర్మన్ పదవికి రాజీనామా చేయడమే కాకుండా రాజకీయాలకు శాశ్వతంగా దూరంగా ఉంటానని కోడి శ్రీనివాసులు స్పష్టం చేశారు. తనపై ఆరోపణలు చేస్తున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కూడా ఇదే విధంగా రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారా అని సవాల్ విసిరారు.

ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ భూతరాజు దశరథ, కౌన్సిలర్లు బుషిపాక వాసు, కోడి సుష్మ వెంకన్న, మాజీ సర్పంచ్ కోడి గిరిబాబు, కోఆప్షన్ సభ్యులు ఖలీల్, మొగుదాల వెంకన్న, షరీఫ్, మున్సిపాలిటీ యూత్ ప్రెసిడెంట్ కన్నబోయిన నాగరాజు, చేనేత సహకార సంఘం డైరెక్టర్లు ఏలే శ్రీను, జూలూరు వెంకటేశం, పన్నాల లింగయ్య, కారింగు రామ్మూర్తి, బొమ్మరబోయిన వెంకటేశం, పున్న సైదులు, సమీర్, బుషిపాక సురేష్, కారింగు మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

Also Read : కేసీఆర్‌ది దొరల న్యాయం.. నాది సామాజిక న్యాయం: సీఎం రేవంత్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>