కలం, కరీంనగర్ బ్యూరో : సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలను మంగళవారం పెద్దపల్లి–మంథని ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి (Dasari Manohar Reddy) హాజరై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ .. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవం కోసం పోరాడిన గొప్ప యోధుడన్నారు.
సామాన్య ప్రజలను ఏకం చేసి సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. అణగారిన వర్గాలకు ధైర్యం, ఆత్మవిశ్వాసం కల్పించిన పాపన్న గౌడ్ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. సమాజంలో అన్ని వర్గాల ప్రజలు సమాన హక్కులు, గౌరవంతో జీవించేలా కృషి చేయడమే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్‌కు అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఆయన చూపిన ధైర్యం, సామాజిక చైతన్యం, ప్రజా సంక్షేమ దృక్పథాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
పాపన్న గౌడ్ చరిత్రను భావితరాలకు అందించేందుకు ఆయన జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడంతో పాటు ఆయన జీవిత చరిత్రను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో రాఘవపూర్ సర్పంచ్ చామంతి శ్రీకాంత్, గౌడ సంఘం బిఆర్‌ఎస్ నాయకులు కొయ్యడ సతీష్ గౌడ్, బాలసాని ఈశ్వర్ గౌడ్ , పడాల సతీష్ గౌడ్, సలేంద్ర రాములు, విక్రమ్ గౌడ్, మెడగొన శ్రీకాంత్ గౌడ్, మెట్టు సమ్మయ్య గౌడ్, బాలసాని శ్రీనివాస్ గౌడ్, కొయ్యడ శ్రీనివాస్ గౌడ్, కార్యకర్తలు, అభిమానులు, పాల్గొన్నారు.

