తొలి రౌండ్‌లో ఘనవిజయం.. సంచలన వ్యాఖ్యలు చేసిన ఉన్నతి

కలం, స్పోర్ట్స్ : 18 ఏళ్ల భారత బ్యాడ్మింటన్ సంచలనం ఉన్నతి హుడా (Unnati Hooda) బిడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో (BWF World Championships)  శుభారంభం చేసింది. మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన తొలి రౌండ్‌లో మయన్మార్ క్రీడాకారిణి థెట్ హ్తార్ తుజార్‌పై విజయం సాధించి టోర్నీలో ముందడుగు వేసింది. ఉన్నతి 22-20, 21-16 తేడాతో ప్రత్యర్థిని ఓడించింది. తొలి గేమ్‌లో కోర్టులో వేగంగా వీచిన గాలి పరిస్థితులను అర్థం చేసుకునేందుకు ఉన్నతి కొంత సమయం తీసుకుంది. దీంతో ఆరంభంలో ఇరువురి మధ్య హోరాహోరీ పోరు సాగింది. అయితే తొలి గేమ్ చివరి ఐదు పాయింట్ల వద్ద ఉన్నతి సంయమనం ప్రదర్శించి కీలక పాయింట్లు సాధించింది. దీంతో 22-20తో గేమ్‌ను సొంతం చేసుకుంది.

రెండో గేమ్‌లో కోర్టు పరిస్థితులను పూర్తిగా అర్థం చేసుకున్న ఉన్నతి.. తన అటాకింగ్ గేమ్‌తో ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించింది. వరుసగా కీలక పాయింట్లు సాధిస్తూ 21-16తో రెండో గేమ్‌ను గెలిచి మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. మ్యాచ్ అనంతరం ఉన్నతి తన విజయంలో తండ్రి ఉపకార్ హుడా పాత్రను ప్రత్యేకంగా గుర్తుచేసుకుంది. యూనివర్సిటీ స్థాయి బ్యాడ్మింటన్ ప్లేయర్ అయిన ఉపకార్ హుడా.. తన కుమార్తె క్రీడా భవిష్యత్తు కోసం ప్రభుత్వ కళాశాలలోని ఉద్యోగాన్ని సైతం వదులుకున్నారు. ప్రస్తుతం ఆమె కోచింగ్ బాధ్యతలను కూడా ఆయనే దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. తండ్రి చేసిన త్యాగాన్ని మాటల్లో చెప్పలేనని ఉన్నతి హుడా తెలిపింది. తన క్రీడా ప్రయాణంలో కుటుంబం అందిస్తున్న సహకారానికి ఎప్పటికీ రుణపడి ఉంటానని పేర్కొంది. తండ్రి తన కోసం చేసిన త్యాగం తనకు ఎప్పుడూ స్ఫూర్తినిస్తుందని చెప్పింది.

ఇదిలా ఉండగా, ప్రపంచ నంబర్ వన్ షట్లర్ షి యు ఖీపై భారత ఆటగాడు ఆయుష్ శెట్టి సాధించిన సంచలన విజయం తనలో ఎంతో నమ్మకాన్ని పెంచిందని ఉన్నతి వెల్లడించింది. కోర్టులో ప్రతి ఒక్కరూ సమానమేనని, మైదానంలో వంద శాతం ప్రతిభను ప్రదర్శిస్తే ఎవరినైనా ఓడించవచ్చని ఆమె అభిప్రాయపడింది. తొలి రౌండ్ విజయంతో ఆత్మవిశ్వాసం పెంచుకున్న ఉన్నతి హుడా.. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో మరింత ముందుకు సాగాలని లక్ష్యంగా పెట్టుకుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>