కలం, తెలంగాణ బ్యూరో: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ (Nitin Nabin) పార్టీ కార్యవర్గాన్ని పునర్వ్యస్థీకరించారు. కొత్త టీమ్‌లో దక్షిణాదికి ప్రాతినిధ్యం తగ్గిందన్న విమర్శలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు నుంచి కేవలం ఆరుగురికి మాత్రమే పదవులు దక్కడం గమనార్హం. వచ్చే ఏడాది పలు కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నితిన్ నబిన్ వ్యూహాత్మకంగా టీమ్‌ను ఏర్పాటు చేసినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
దక్షిణాదికి దక్కిన పదవులు ఇవే..
ఏపీ నుంచి దగ్గుబాటి పురందేశ్వరి జాతీయ ఉపాధ్యక్షురాలిగా, విష్ణువర్ధన్ రెడ్డి ఆల్ సెల్స్ జాయింట్ కోఆర్డినేటర్‌గా నియమితులయ్యారు. కర్ణాటక నుంచి ఎం.నాగరాజు జాతీయ ఉపాధ్యక్షుడిగా, కేరళ నుంచి కె.సురేంద్రన్, అనిల్ ఆంటోనీ జాతీయ కార్యదర్శులుగా ఎంపికయ్యారు. తమిళనాడు నుంచి ఎం.వెంకటేశన్ జాతీయ కార్యదర్శిగా చోటు దక్కించుకున్నారు.
స్మృతి ఇరానీకి కీలక బాధ్యత..
మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి కీలక పదవి దక్కింది. ఆమెను జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవంతో పాటు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పదవి దక్కినట్టు తెలుస్తోంది. బీజేపీ సీనియర్ నేత రామ్ మాధవ్‌కు జాతీయ ఉపాధ్యక్ష పదవి దక్కింది. వసుంధరా రాజే, బై జయంత్ జయ్ పాండా తదితరులు కూడా ఉపాధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. మొత్తం 13 మంది జాతీయ ఉపాధ్యక్షులను నియమించారు. బీఎల్ సంతోష్ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు)గా కొనసాగనున్నారు. వినోద్ తావడే, సునీల్ బన్సల్ తదితరులకు కూడా కీలక బాధ్యతలు కొనసాగాయి. అదే సమయంలో కొత్త ముఖాలకు అవకాశం కల్పించారు.
మహిళలకు ప్రాధాన్యం..
- కొత్త టీమ్‌లో మహిళలకు కూడా గణనీయమైన ప్రాతినిధ్యం కల్పించారు. 13 మంది జాతీయ ఉపాధ్యక్షుల్లో ఆరుగురు మహిళలు ఉన్నారు.
- మొత్తం జాతీయ టీమ్‌లో 10 మంది మహిళలకు చోటు లభించింది. 2027లో పలు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసే లక్ష్యంతోనే
- ఈ సంస్థాగత పునర్వ్యవస్థీకరణ జరిగినట్లు తెలుస్తోంది.
- అనుభవజ్ఞులతో పాటు కొత్త నేతలకు అవకాశం ఇవ్వడం ద్వారా పార్టీ జాతీయ స్థాయిలో కొత్త కూర్పును ఏర్పాటు చేసింది.
పీయూష్ గోయల్‌కు కీలక పదవి..
కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను బీజేపీ జాతీయ కోశాధికారిగా నియమించారు. రాజేశ్ మంగళ్‌కు జాతీయ జాయింట్ ట్రెజరర్ బాధ్యతలు అప్పగించారు. తరుణ్ చుగ్‌ను సెంట్రల్ ఆఫీస్ ఇన్‌ఛార్జిగా, సంబిత్ పాత్రాను ఈశాన్య రాష్ట్రాల సమన్వయకర్తగా నియమించారు. నితిన్ నబీన్ ప్రకటించిన కొత్త టీమ్‌లో ఉత్తరాది రాష్ట్రాలకు విస్తృత ప్రాతినిధ్యం కల్పించినా.. దక్షిణాదిని ఆరు పదవులకే పరిమితం కావడం ఆసక్తికరంగా మారింది.
సీనియర్లను పక్కన పెట్టారా?
గత జాతీయ కార్యవర్గంలో కీలక బాధ్యతలు నిర్వహించిన దుష్యంత్ గౌతమ్, రాధామోహన్ దాస్ అగర్వాల్, సంజయ్ మయూఖ్, సరోజ్ పాండే, తేజస్వీ సూర్య, లక్ష్మీకాంత్ బాజ్‌పేయి, అరుణ్ సింగ్ తదితరులకు కొత్త జాబితాలో చోటు దక్కలేదు. దీంతో నితిన్ నబిన్ కొత్త టీమ్‌లో పాతవారిని కొనసాగించడంతో పాటు పలువురు కొత్త ముఖాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు స్పష్టమవుతోంది.
అమిత్ మాలవీయను ఎందుకు తప్పించారు?
గత 11 ఏళ్లుగా పార్టీ ఐటీ, సోషల్ మీడియా వ్యవహారాలకు చీఫ్‌గా వ్యవహరించిన అమిత్ మాలవీయ స్థానంలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన దీపక్ మాస్కేను నియమించడం ఆసక్తికరంగా మారింది. ఎన్నికల రాజకీయాల్లో సోషల్ మీడియా పాత్ర కీలకంగా మారుతున్న వేళ బీజేపీ తన డిజిటల్ ప్రచారానికి మరింత పదును పెట్టబోతున్నట్టు అర్థమవుతోంది. దీపక్ మాస్కేకు ఐటీ, సోషల్ మీడియా వ్యవహారాల్లో సుదీర్ఘ అనుభవం ఉంది.
2009 నుంచి బీజేపీతో అనుబంధం కొనసాగిస్తున్న దీపక్ .. ఛత్తీస్‌గఢ్‌లో డిజిటల్ కార్యకలాపాలను విస్తృతంగా నిర్వహించారు. 2018లో బీజేపీ సోషల్ మీడియా వాలంటీర్లను పెద్ద సంఖ్యలో రిక్రూట్ చేసుకోవడంలో సమన్వయం చేయడంలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం సీజేపీ లాంటి పార్టీలతో బీజేపీకి గట్టి సవాల్ ఎదురవుతున్న క్రమంలో జెన్ జీని ఆకట్టుకోవాలని బీజేపీ ఆయన్ను రంగంలోకి దించినట్లు తెలుస్తోంది.
కెమిస్ట్రీ ప్రొఫెసర్ ఏం చేయబోతున్నారు?
దీపక్ మాస్కే సోషల్ మీడియా ప్రచారకర్తగా కాకుండా.. ఎన్నికల డేటా, విశ్లేషణ, డిజిటల్ క్యాంపెయిన్లతో పనిచేశారు. ఆయనకు ఇంజినీరింగ్ డిగ్రీతో పాటు సైన్స్ నేపథ్యం ఉంది. గతంలో కెమిస్ట్రీ ప్రొఫెసర్‌గా కూడా పనిచేశారు. దీంతో ఆయన నేతృత్వంలో బీజేపీ ఐటీ సెల్ మరింత సమర్థంగా డేటా ఆధారంగా జెన్ జీని ఆకట్టుకొనేలా పనిచేస్తుందని పార్టీ అధినాయకత్వం భావించినట్లు సమాచారం. దీపక్ మాస్కేకు కో కన్వీనర్లుగా ప్రీతి గాంధీ, శివానంద్ ద్వివేది, అలోక్ భట్, అరుణ్ యాదవ్ సహకరించనున్నారు. డిజిటల్ కమ్యూనికేషన్‌ను ఒక్క కీలక వ్యక్తి ఆధారంగా నడిపే విధానం కంటే టీమ్ ఆధారిత వ్యవస్థగా రూపుదిద్దుతున్నట్టు సమాచారం.
సరికొత్త వ్యూహాలు..
సోషల్ మీడియా ఇప్పుడు కేవలం పోస్టులు, వీడియోలు పెట్టే వేదిక కాదు. ఓటర్లను గుర్తించడం, ప్రాంతాల వారీగా సందేశాలను రూపొందించడం, స్థానిక సమస్యలను డిజిటల్ ప్రచారంగా మార్చడం, ప్రత్యర్థి ప్రచారానికి వెంటనే స్పందించడం వంటి అంశాలు ఎన్నికల వ్యూహంలో భాగమయ్యాయి. అందుకే బీజేపీ సోషల్ మీడియా చీఫ్‌ను మార్చి కొత్త వ్యక్తికి పగ్గాలు అప్పగించింది.
త్వరలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ?
- కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు బీజేపీ జాతీయ కోశాధికారి పదవి దక్కడంతో కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై చర్చ మొదలైంది.
- బీజేపీ సంస్థాగత నిబంధనల ప్రకారం కీలకమైన పార్టీ, ప్రభుత్వ బాధ్యతలను ఒకే వ్యక్తి ఇవ్వడం కుదరదు. దీంతో ఈ చర్చకు బలం చేకూరుతున్నది.
- గోయల్‌ను కేబినెట్ నుంచి తప్పించి పార్టీ బాధ్యతల్లో కొనసాగిస్తారా? అనే ఊహాగానాలు మొదలయ్యాయి. త్వరలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరగబోతున్నదని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే ప్రకటించడం గమనార్హం.
ప్రధాని మోదీ అభినందనలు..
కొత్తగా నియమితులైన జాతీయ కార్యవర్గసభ్యులకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. కొత్త టీమ్‌లో సంస్థాగత అనుభవం, ఉత్సాహం, క్షేత్రస్థాయి అనుసంధానం కలిసివున్నాయని పేర్కొన్నారు. పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజాసేవపై దృష్టి సారిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.

