కలం, వెబ్ డెస్క్: భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఇద్దరు పాకిస్థాన్ పౌరులను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) కాల్చి చంపింది. పంజాబ్ రాష్ట్రంలోని అంతర్జాతీయ సరిహద్దు తార్న్ తరణ్ జిల్లా రాజోకే గ్రామంలోని బోర్డర్ ఔట్ పోస్ట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై బీఎస్ఎఫ్ ఇంకా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఇద్దరు వ్యక్తులు పాకిస్థాన్ నుంచి కంచె దాటి భారత్ భూభాగంలోకి వచ్చేందుకు ప్రయత్నం చేశారు.
బీఎస్ఎఫ్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై వారిని వెనక్కి వెళ్లిపోవాలని హెచ్చరించారు. అయినా కూడా వినకపోవడంతో.. జవాన్లు కాల్పులు జరిపారు. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. వీరితో పాటు వచ్చిన మూడో వ్యక్తి కాల్పుల ధాటికి అక్కడి నుంచి పారిపోయాడు. మృతి చెందిన ఇద్దరి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. సాధారణ పౌరులా.. లేకపోతే ఉగ్రవాదులా.. అనే అంశంపై బీఎస్ఎఫ్ కూడా అంతర్గత దర్యాప్తు చేస్తోంది.

