‘శక్తి వద్దు.. SBTET ముద్దు.. కరీంనగర్‌లో SFI ఆందోళన

కలం, కరీంనగర్ బ్యూరో: భారత విద్యార్థి ఫెడరేషన్ (SFI) కరీంనగర్ (Karimnagar) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పాలిటెక్నిక్ కళాశాల (ఉజ్వల పార్కు పక్కన ఉన్న) ముందు విద్యార్థులతో కలిసి నిరసన (SFI Protest) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా SFI జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ (YISU) పేరుతో తీసుకువచ్చిన శక్తి పాలసీ ద్వారా డిప్లమా కోర్సులను ITI, ATCలతో అనుసంధానం చేయడం సరికాదని అన్నారు.

విద్యారంగాన్ని ‘ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్’ పేరుతో SBTET (State Board of Technical Education and Training) పరిధి నుంచి తొలగించే కుట్రలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే మానుకోవాలని హెచ్చరించారు. అదేవిధంగా, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా పాలిటెక్నిక్ విద్యార్థులను కేవలం కార్మికులుగా మార్చే విధానాలను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 97ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని కోరారు.

స్కిల్ యూనివర్సిటీ పేరుతో విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ‘స్కిల్ ఇండియా’ పేరుతో ప్రభుత్వ విద్యాసంస్థలను కార్పొరేట్ సంస్థలకు అప్పగించడం ఏమిటని ప్రశ్నించారు. డిప్లమా పూర్తయిన తర్వాత ECET ద్వారా విద్యార్థులు నేరుగా B.Tech 2nd ఇయర్ లో ప్రవేశించే అవకాశం ఉందని, అయితే జీవో నెంబర్ 97లో దీనిపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని అన్నారు.

పాలిటెక్నిక్ కోర్సులను మరింత అభివృద్ధి చేసి ఇంజనీరింగ్ విద్యకు అనుగుణంగా తీర్చిదిద్దాల్సింది పోయి, వాటి స్థాయిని తగ్గించే విధంగా నిర్ణయాలు తీసుకోవడాన్ని SFI తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. తక్షణమే జీవో నెంబర్ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా డిప్లమా విద్యార్థులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు వినయ్ సాగర్, జిల్లా కమిటీ సభ్యులు రాకేష్, సన్నీ తదితరులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>