కలం, స్పోర్ట్స్: ఆగస్టు 28 నుంచి దుబాయ్‌లో ప్రారంభమయ్యే మహిళల ఆసియా కప్-2026 కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఫాతిమా సనా (Fatima Sana)ను కెప్టెన్‌గా నియమించారు. ఇటీవల శ్రీలంక పర్యటనలో టీ20 సిరీస్‌కు దూరమైన ఫాతిమా సనా తిరిగి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆమె ఇంగ్లండ్‌లో ‘ది హండ్రెడ్’ టోర్నీ ఆడటం వలన ఆ సిరీస్‌కు దూరమయ్యారు. ఆమెతో పాటు సాధియా ఇక్బాల్, గుల్ ఫిరోజా కూడా తిరిగి జట్టులోకి వచ్చారు.
టోర్నీకి బయలుదేరేముందు ఆగస్టు 16 నుంచి 25 వరకు లాహోర్‌లోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఆటగాళ్లకు శిక్షణ శిబిరం జరగనుంది. సెప్టెంబర్ 1న థాయ్‌లాండ్‌తో పాక్ తొలి మ్యాచ్ ఆడనుంది. సీనియర్ ఫాస్ట్ బౌలర్ డయానా బేగ్‌కు ఈ జట్టులో చోటు దక్కలేదు. రిజర్వ్ ఆటగాళ్ల జాబితాలో కూడా ఆమె పేరు లేదు. దీనిపై బోర్డు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
సెప్టెంబర్ 13న ఆసియా కప్ ఫైనల్..
ఆసియా కప్ ముగిసిన వెంటనే ఏషియన్ గేమ్స్ కూడా ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 13న ఆసియా కప్ ఫైనల్ జరగనుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 17న ఏషియన్ గేమ్స్ క్వార్టర్ ఫైనల్లో థాయ్‌లాండ్‌తో పాక్ తలపడనుంది. రెండు టోర్నీలు వరుసగా ఉండటంతో ఏషియన్ గేమ్స్ జట్టులో కొన్ని మార్పులు చేశారు. నజీహా అల్వీ, వహీదా అక్తర్, సాధియా ఇక్బాల్‌లకు ఏషియన్ గేమ్స్ ప్రధాన జట్టులో చోటు దక్కలేదు. వారి స్థానాల్లో ఆలియా రియాజ్, తస్మియా రుబాబ్, హుమ్నా బిలాల్‌లను ఎంపిక చేశారు. ఏషియన్ గేమ్స్‌కు కూడా ఫాతిమా సనానే కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఈ రెండు కీలక టోర్నీల్లో జట్టు ఎంతవరకు రాణిస్తుందో వేచి చూడాలి.
ఆసియా కప్ 2026కు పాకిస్థాన్ జట్టు: ఫాతిమా సనా (కెప్టెన్), అయేషా జాఫర్, ఈమాన్ నసీర్, ఐమన్ ఫాతిమా, గుల్ ఫిరోజా, మోమినా రియాసత్, మునీబా అలీ సిద్ధిఖీ (వికెట్ కీపర్), నజీహా అల్వీ, నష్రా సంధు, సాధియా ఇక్బాల్, సైరా జబీన్, షావాల్ జుల్ఫికర్, తుబా హసన్, ఉమ్మ్-ఎ-హానీ, వహీదా అక్తర్.
రిజర్వ్ ప్లేయర్లు: తస్మియా రుబాబ్, హుమ్నా బిలాల్, మహమ్ అనీస్, సదఫ్ షమాస్.

