కలం, కరీంనగర్: ఐదు నిమిషాల్లో చేరాల్సిన గమ్యానికి గంట సమయం.. గుంతల రోడ్డుపై నిత్యం అవస్థలు.. రైల్వే గేట్ వద్ద ట్రాఫిక్ కష్టాలు.. ఇవన్నీ తీగలగుట్టపల్లి ప్రజలకు మూడేళ్లుగా నిత్యకృత్యంగా మారాయి. ఇంతకాలంగా పెండింగ్‌లో ఉన్న తీగలగుట్టపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి (Theegalaguttapally ROB) నిర్మాణ పనులను ఇకనైనా వేగవంతం చేసి ప్రజల రవాణా కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.
కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ వెలిచాల రాజేందర్రావు సూచన మేరకు ఆదివారం అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో రైల్వే ట్రాక్ సమీపంలో ధర్నా నిర్వహించారు. ఆర్ఓబీ పనుల్లో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరసన్న మాట్లాడుతూ.. “ప్రజల ప్రయాణానికి మార్గం వేయాల్సిన ఆర్ఓబీ.. మూడేళ్లుగా నిరీక్షణకు ప్రతీకగా మారింది. ఐదు నిమిషాల్లో చేరాల్సిన దూరానికి గంట సమయం పడుతుంటే సామాన్యుడి బాధ ఎవరు పట్టించుకుంటారు?” అని ప్రశ్నించారు.
గుంతలమయమైన రహదారిపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా గర్భిణులు, వృద్ధులు, అత్యవసర పరిస్థితుల్లో వెళ్లే ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోజుకు నాలుగైదుగురు కూలీలతో పనులు సాగించడం వల్ల నిర్మాణం నత్తనడకన సాగుతోందని విమర్శించారు.
“ఎన్నికల ముందు శంకుస్థాపనలు చేసి హామీలు ఇవ్వడం కాదు.. ఇచ్చిన హామీని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. మరో ఎన్నిక వచ్చే వరకు ఆర్ఓబీ కోసం ప్రజలు ఎదురుచూడాల్సిందేనా?” అంటూ ఎంపీ బండి సంజయ్‌పై విమర్శలు గుప్పించారు.
ఆర్ఓబీ నిర్మాణంతో తీగలగుట్టపల్లి (Theegalaguttapally) పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడంతో పాటు, నగరంలోని పలు ప్రాంతాలకు రాకపోకలు సులభతరం అవుతాయని అన్నారు. సంబంధిత అధికారులు, కాంట్రాక్ట్ సంస్థలు సమన్వయంతో పనిచేసి నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ఆకుల నరసయ్య, కార్పొరేటర్ బానోతు భాస్కర్ నాయక్, సీనియర్ నాయకులు కాసేట్టి శ్రీనివాస్, 3వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, 2వ డివిజన్ అధ్యక్షుడు కొలగాని అనిల్, మనోహర్, రాము, మహిళా నాయకురాళ్లు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
Also Read : కేసీఆర్ కుటుంబంపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Follow Us On: Instagram

