హాకీ వరల్డ్ కప్‌లో బోణీ కొట్టిన భారత్..!

క‌లం, వెబ్‌డెస్క్‌: ఎఫ్ఐహెచ్ పురుషుల హాకీ ప్రపంచకప్ (Hockey World Cup) 2026లో భారత జట్టు బోణీ కొట్టింది. శనివారం నెదర్లాండ్స్‌లోని వేగనర్ స్టేడియంలో జరిగిన తొలి పూల్ డి మ్యాచ్‌లో వేల్స్‌పై 3-1 తేడాతో విజయం సాధించింది. తొలి క్వార్టర్‌లోనే పెనాల్టీ కార్నర్ల ద్వారా సంజయ్, కెప్టెన్ హర్మాన్‌ప్రీత్ సింగ్‌లు గోల్స్ చేసి భారత్‌ను ముందుంచారు. మ్యాచ్ 8వ నిమిషంలో సంజయ్ గోల్ ఖాతా తెరవగా, 11వ నిమిషంలో హర్మాన్‌ప్రీత్ దాన్ని రెట్టింపు చేశారు.

తర్వాత మ్యాచ్‌పై ఆధిక్యం నిలుపుకున్న భారత్‌కు 43వ నిమిషంలో మరో గోల్ లభించింది. హర్మాన్‌ప్రీత్ సింగ్ తన రెండో పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచడంతో భారత్ 3-0తో నిలిచింది. ఆట 55వ నిమిషంలో వేల్స్ ప్లేయర్ సామ్ వెల్ష్ ఒక గోల్ కొట్టి తేడాను తగ్గించినా, చివరి వరకు భారత డిఫెన్స్ గట్టిగా నిలబడింది. ఈ గెలుపుతో పూల్ డి పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానానికి చేరింది. తదుపరి మ్యాచ్‌లో ఆగస్టు 17న ఇంగ్లాండ్‌తో తలపడనుంది.

ఈ టోర్నీలో ఇంగ్లాండ్, వేల్స్, చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌లతో కలిసి భారత్ పూల్ డిలో ఉంది. 1975లో ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించి టైటిల్ నెగ్గిన భారత్‌ను, గడిచిన 50 ఏళ్లుగా ఈ వరల్డ్ కప్ టైటిల్ ఊరిస్తూనే ఉంది. 2023 ఎడిషన్‌లో 9వ స్థానంతో సరిపెట్టుకున్న భారత్.. ఇప్పుడు పతక వేటలో ఉంది. వరుసగా రెండు ఒలింపిక్ కాంస్య పతకాలు, ఆసియా కప్, ఆసియన్ ఛాంపియన్స్ ట్రోఫీ విజయాలతో లభించిన ఆత్మవిశ్వాసంతో జట్టు బరిలోకి దిగింది.

మ్యాచ్ ప్రారంభానికి ముందు కెప్టెన్ హర్మాన్‌ప్రీత్ సింగ్ మీడియాతో మాట్లాడారు. తమ జట్టు 51 ఏళ్ల సుదీర్ఘ వేచిచూపునకు ముగింపు పలకాలనే పట్టుదలతో ఉందన్నారు. టోర్నీలో సర్వస్వం ఒడ్డి పోరాడేందుకు జట్టు సిద్ధంగా ఉందని చెప్పారు. ఈ ప్రపంచకప్ తమకు ఎంతో ముఖ్యమని, సీనియర్ ఆటగాళ్లకు ఇది చాలా పెద్ద అవకాశమని హర్మాన్‌ప్రీత్ పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>