కలం, వెబ్ డెస్క్: దేశ నిర్మాణంలో ప్రతి భారతీయుడు భాగస్వామి కావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా తెలంగాణ భవన్‌లో జాతీయ జండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర, దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పార్టీ (BRS) శ్రేణులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ప్రజలకు, రైతులకు సమాన అవకాశాలివ్వాలి..
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి నుంచి దేశ నిర్మాణం మరోసారి ప్రారంభం కావాలంటే కేసీఆర్ (KCR) తిరిగి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. కేసీఆర్ నాయకత్వంలో మళ్లీ తెలంగాణను పట్టాలెక్కిద్దామని పిలుపునిచ్చారు. రెండేళ్ల తర్వాత రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని.. తెలంగాణ అభివృద్ధి బాట పట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దేశ ప్రజలకు అవకాశాలు, దేశానికే వెన్నెముక అయిన రైతులకు భరోసా, అన్ని రాష్ట్రాల సమాన అభివృద్ధే నిజమైన దేశభక్తి అని వ్యాఖ్యానించారు.
గాంధీని అవమానించడం బాధాకరం..
ప్రపంచవ్యాప్తంగా మహాత్మా గాంధీని గొప్పగా గౌరవిస్తుంటే.. దేశంలో మాత్రం ఆయనను అవమానించేలా వ్యవహరించడం బాధాకరమని కేటీఆర్ (KTR) అభిప్రాయపడ్డారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన వారిని గౌరవించడం ప్రతి భారతీయుడి బాధ్యత అని పేర్కొన్నారు. భారతదేశంలో సహజ వనరులకు కొదవ లేదని.. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్ళైనా ప్రజలకు కనీస సౌకర్యాలు ఎందుకు లేవు? అని ప్రశ్నించారు.
తాగునీటి కోసం అల్లాడుతున్నారు..
దాదాపు 70 వేల టీఎంసీల నీటి లభ్యత ఉన్న దేశంలో ఇప్పటికీ సాగునీటి కోసం రైతులు, తాగునీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని ప్రతి ఎకరానికి సాగునీరు ఇవ్వాలని కేసీఆర్ ఆకాంక్షించారని గుర్తుచేశారు. సబ్బండ వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను గ్రామ గ్రామాన ఎండగడదామని పిలుపునిచ్చారు.
Also Read : స్మార్ట్ రేషన్ కార్డ్స్ రాష్ట్ర చరిత్రలోనే ప్రత్యేకం: మంత్రి ఉత్తమ్
Follow Us On: Instagram

