కలం, ఖమ్మం బ్యూరో: దక్షిణ భారతదేశపు అయోధ్యగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన భద్రాచలం స్వరూపాన్ని 2014 నాటి రాష్ట్ర విభజన, పోలవరం ప్రాజెక్టు నిర్ణయం పూర్తిగా మార్చివేశాయి. నాటి విభజన చట్టంలో భాగంగా తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌తో ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేశారు. అయితే, క్షేత్రస్థాయి భౌగోళిక పరిస్థితులను గానీ, ప్రజల నిత్య జీవిత అనుబంధాలను గానీ పరిశీలించకుండా తీసుకున్న ఈ తొందరపాటు నిర్ణయం ఈ ప్రాంతానికి ఒక ఆరని గాయంగా మారింది. ముఖ్యంగా భద్రాచలం (Bhadrachalam) పట్టణంతో వేరుచేయలేని బంధం కలిగిన కన్నాయిగూడెం, గుండాల, యటపాక, పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నం అనే ఐదు గ్రామపంచాయతీలు పోలవరం ఆర్అండ్ఆర్ జాబితాలో లేకపోయినా ఏపీ పరిధిలోకి వెళ్లడమే అసలు సమస్యకు నాంది పలికింది.
మరొకవైపు, ఈ ఐదు పంచాయతీలు ఏపీలో ఉండిపోవడం వల్ల భద్రాచల క్షేత్ర అభివృద్ధి పూర్తిగా ఆగిపోయింది. భద్రాచలంలో ప్రస్తుతం చెత్త వేయడానికి సెంటు స్థలం కూడా లభించని పరిస్థితి దాపురించింది. ఫలితంగా పవిత్ర గోదావరి నది కరకట్టే డంపింగ్ యార్డుగా మారి పర్యావరణానికి, పవిత్రతకు విఘాతం కలిగిస్తోంది. పవిత్ర రామాలయ విస్తరణకు, భక్తుల కోసం మాడ వీధులు, వసతి గృహాలు నిర్మించాలన్నా స్థలం సరిపోని పరిస్థితి, పాండురంగాపురం నుంచి ఒడిశాలోని మల్కన్‌గిరి వరకు ప్రస్తావిత రైల్వే లైన్‌కు భద్రాచలంలో చోటు లేకపోవడంతో, పక్కనే ఉన్న యటపాకలో స్టేషన్ ఏర్పాటు చేయాల్సిన దుస్థితి. అయితే యటపాక ఏపీ పరిధిలో ఉండటంతో, దశాబ్దాలుగా భద్రాచలానికి రావాల్సిన రైల్వే కనెక్టివిటీ నెరవేరని కలగానే మిగిలిపోతోంది.
ఇరు రాష్ట్రాల మధ్య సమన్వయ లోపం
కేవలం అభివృద్ధి మాత్రమే కాకుండా, వరదల వేళ ప్రజల ప్రాణాలకు కూడా ఈ సరిహద్దు వివాదం పెద్ద ముప్పుగా పరిణమిస్తోంది. గోదావరి కరకట్ట స్లూయిజ్లలో రెండు తెలంగాణలో, మరో రెండు ఏపీ పరిధిలో ఉండటంతో ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఫలితంగా గోదావరి పొంగినప్పుడల్లా స్లూయిజ్‌ల ద్వారా నీరు లీక్ అయి భద్రాచలం పట్టణంతో పాటు చుట్టుపక్కల కాలనీలు నీట మునుగుతున్నాయి. 2022లో గోదావరి నీటిమట్టం 71.3 అడుగులకు చేరినప్పుడు గుండాల గ్రామ ప్రజలు ఇళ్ల కప్పులపైకి ఎక్కి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపిన దృశ్యాలు ఈ భౌగోళిక అస్పష్టతకు నిదర్శనం. ఆ సమయంలో ఏపీ అధికార యంత్రాంగం సరిగా స్పందించలేకపోయినా, భద్రాచలంలో ఉన్న తెలంగాణ అధికారులే స్పందించి రెస్క్యూ టీమ్‌లను పంపి, వారి ప్రాణాలను కాపాడాల్సి వచ్చింది.
గడిచిన పన్నెండేళ్లుగా ఈ ఐదు గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపాలనే అంశం ప్రతీ ఎన్నికల్లోనూ అన్ని రాజకీయ పార్టీలకు ఒక ప్రధాన ప్రచార అస్త్రంగానే మిగిలిపోయింది. తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు మారినా, ఏపీలో టీడీపీ, వైఎస్సార్సీపీ ప్రభుత్వాలు మారినా, కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొనసాగుతున్నా… ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం, ఆ తర్వాత దాన్ని పక్కనబెట్టడం ఆనవాయితీగా మారింది. రాజకీయ పార్టీల మాటలు పక్కనబెడితే, స్థానిక ప్రజలు మాత్రం ధర్నాలు, నిరసనల ద్వారా తమ నిరసన స్వరాన్ని వినిపిస్తూనే ఉన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు వినతిపత్రాలు సమర్పిస్తూ, నిరంతర పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు.
పుష్కరాల నాటికైనా గ్రహణం వీడేనా!
రాబోయే గోదావరి పుష్కరాల నాటికైనా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించాల్సిన అత్యవసరం ఏర్పడింది. పుష్కరాల వేళ భద్రాచలానికి తరలివచ్చే లక్షలాది మంది భక్తులకు వసతి, పార్కింగ్ సౌకర్యాలు కల్పించాలన్నా, భద్రాచల పట్టణ సమగ్ర రూపురేఖలు మారాలన్నా ఈ ఐదు గ్రామ పంచాయతీలు తెలంగాణలో కలవడం ఒక్కటే మార్గం. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని సరిహద్దుల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను చేపట్టి, ఈ ఐదు పంచాయతీలను తెలంగాణలో విలీనం చేస్తేనే పన్నెండేళ్ల ప్రజల ఆక్రోశానికి, భద్రాద్రి క్షేత్రానికి పట్టిన ఈ ‘రాజకీయ’ గ్రహణానికి విముక్తి లభిస్తుందనీ స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మా ప్రాణం తెలంగాణలోనే: సంపత్, కన్నాయిగూడెం, అల్లూరి జిల్లా
మా ఐదు గ్రామాల విలీనంతో భద్రాచలం చుట్టూ ఒకరకమైన భౌగోళిక దిగ్బంధనం ఏర్పడింది. నాటి నుంచి నేటి వరకు మా ఐదు గ్రామాల ప్రజల బతుకులు అటు ఏపీకి భౌగోళికంగా దూరమై, ఇటు తెలంగాణ సౌకర్యాలకు నోచుకోలేకపోతున్నాయి. ఉదయం లేస్తే రేషన్ సరుకుల నుంచి, విద్య, వైద్యం, వ్యాపారం, ఉపాధి వరకు ప్రతీదానికీ మేము భద్రాచలం పట్టణంపైనే ఆధారపడాలి. కానీ, పాలనాపరమైన ఒక సంతకం కోసం మాత్రం వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏపీ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి దాపురించింది. “మా ఊళ్లు ఏపీ భూభాగంలో ఉన్నా, మా ప్రాణం, జీవనం మాత్రం తెలంగాణలోనే ఉన్నాయి” పన్నెండేళ్ళుగా అనేక ఇబ్బందులు పడుతున్నాం. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం వీలైనంత త్వరగా మా సమస్యకు పరిష్కారం చూపాలి.

