కలం, వెబ్ డెస్క్: డాక్టర్ కావాలనేది ఆయన చిన్నప్పటి కల. 12వ తరగతి పూర్తి కాగానే స్టెత స్కోప్ కూడా కొనేశారు. కానీ, కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఆయన కలకు అడ్డొచ్చాయి. డాక్టర్ లక్ష్యాన్ని క్రమంగా దూరం చేశాయి. అయినా పట్టు వదల్లేదు. 51 ఏళ్ల వయస్సులో తన చిన్నప్పటి కల నెరవేర్చుకున్నారు. మెడికల్ కాలేజీలో సీటు సంపాదించి.. వైద్య చరిత్రలోనే అత్యధిక వయస్సులో ఎంబీబీఎస్ చదవబోతున్న వ్యక్తిగా అరుదైన రికార్డ్ సాధించారు. తమిళనాడులోని సురేశ్ కుమార్ (Suresh Kumar) విజయ గాథ ఇది.
రెండు పీహెచ్.డీలు చేసి..
తమిళనాడులోని వేదరణ్యానికి చెందిన సురేశ్ కుమార్ (Suresh Kumar) దివ్యాంగుడు. ఫార్మసీలో ఉన్నత విద్య చదివారు. బయో సైన్స్‌లో ఏకంగా రెండు పీహెచ్.డీలు సాధించారు. అయినా మెడికల్ డాక్టర్ కావాలనేది ఆయన కల. నీట్ అర్హత వయస్సు దాటిపోయింది. ఈ సమయంలోనే సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పు అతడిలో కొత్త ఆశలు చిగురించేలా చేసింది. నీట్ రాసేందుకు అభ్యర్థుల వయస్సుతో సంబంధం లేదని స్పష్టం చేయడంతో వెంటనే సురేశ్ కుమార్ నీట్ పరీక్షకు అప్లై చేశారు.
పగలు ఉద్యోగం.. రాత్రి చదువు..
సురేశ్ కుమార్ పగలు ఉద్యోగం చేసేవారు. సాయంత్రం ఇంటికి వచ్చాక అన్నీ పనులు పూర్తి చేసుకుని రాత్రి 10 గంటలకు పుస్తకాలు చదవడం ప్రారంభించారు. అర్ధరాత్రి వరకు చదువుకుని, మళ్లీ తెల్లవారుజామునే నిద్ర లేచి ఆఫీస్ టైం వరకు ప్రిపేర్ అవుతూనే ఉండేవారు. సురేశ్ కుమార్‌కు ఆయన భార్య సంపూర్ణ సహకారం అందించి ప్రోత్సహించారు. ఆమె సైతం ఉదయం 4 గంటలకే లేచి, ఆయనకు కావాల్సినవి సమకూరుస్తుండేవారు. మోడల్ పేపర్లు, గత సంవత్సరాల్లో అడిగిన క్వశ్చన్ పేపర్లను రోజూ ప్రాక్టీస్ చేస్తుండేవారు.
రెండోసారి విజయం..
2023 నుంచి నీట్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న సురేశ్ కుమార్ మొదటిసారి రాసినప్పుడు విఫలం అయ్యారు. పట్టు వదలకుండా మరోసారి రాయగా.. ర్యాంక్ సాధించారు. మొదటిసారి తమిళ్ భాషలో రాయగా.. రెండో సారి ఇంగ్లీష్ ఎంచుకుని సక్సెస్ కొట్టారు. ఇటీవల తమిళనాడు ప్రభుత్వం ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ నిర్వహించగా.. నాగపట్టిణంలోని మెడికల్ కాలేజీలో సీటు లభించింది. చిన్ననాటి కల నెరవేరినందుకు ఆనందంగా ఉందని, తన భార్య సహకారం మర్చిపోలేనని సురేశ్ కుమార్ ఆనందం వ్యక్తం చేశారు.
Also Read : రాహుల్ గాంధీకి షాక్.. నోటీసులు జారీ!
Follow Us On : WhatsApp

