కలం, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలోని నాసిక్ (Nashik)లో భారీ నకిలీ కరెన్సీ (Fake Currency) దందా వెలుగులోకి వచ్చింది. ఓ ముఠా అసలు కరెన్సీ తీసుకొని దానికి మూడు రెట్లు నకిలీ కరెన్సీ ఇస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తాజాగా ఈ ముఠా స్థావరంపై పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు దాడులు చేశారు. నాసిక్-త్రయంబకేశ్వర్ రోడ్డులోని తాలేగావ్ గ్రామంలోని ఓ భవనంలో ముఠా సభ్యులు నకిలీ నోట్లు ముద్రిస్తున్నట్లు గుర్తించారు. ఈ ముఠాలోని ఐదుగురు సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ ముఠా కొన్ని ప్రత్యేక రసాయనాలు వాడి రూ.500 నకిలీ నోట్లను ముద్రిస్తోంది. అసలు నోట్లను ప్రత్యేక రసాయనంలో ముంచి, దాని నుంచి వచ్చిన ఇంక్‌ను కాగితంపైకి బదిలీ చేసి నకిలీ నోట్లు తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తాజాగా ఓ వ్యక్తికి రూ.10 లక్షల అసలు నోట్లకు రూ.30 లక్షల నకిలీ నోట్లు (Fake Currency) ఇచ్చే సమయంలో పోలీసులు దాడి చేశారు.
పోలీసులు నిందితుల నుంచి మొత్తం రూ. 12.2 లక్షల విలువైన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో రూ.9.75 లక్షల అసలు కరెన్సీ, నోట్ల సైజులో ఉన్న కాగితాలు, రసాయనాలు, ప్రింటింగ్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, ఒక కారు ఉన్నాయి. అరెస్ట్ చేసిన ఐదుగురిని కోర్టులో హాజరుపర్చగా మూడు రోజుల పోలీసు కస్టడీకి రిమాండ్ చేసింది. ఈ ముఠాకు సంబంధించిన నోట్ల పంపిణీ నెట్‌వర్క్‌పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : వైభవ్‌ను ఎలా ఔట్ చేయాలో చెప్పిన భజ్జీ!
Follow Us On : WhatsApp

