కలం, ఖమ్మం బ్యూరో: కొత్త పెన్షన్ల మంజూరు కోసం ప్రభుత్వం చేపడుతున్న దరఖాస్తుల ప్రక్రియలో వృద్ధాప్య పెన్షన్‌కు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా ముదిగొండలో (Mudigonda) నిరసన మిన్నంటింది. ఈ మేరకు శుక్రవారం బీఆర్ఎస్ ముదిగొండ మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం వృద్ధాప్య పెన్షన్‌తో పాటు అన్ని రకాల పెన్షన్ల మొత్తాన్ని రెట్టింపు చేసి, వెంటనే అందించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
ముదిగొండ (Mudigonda) బస్టాండ్ సెంటర్ నుంచి ఎంపీడీవో కార్యాలయం వరకు పార్టీ శ్రేణులు భారీ ర్యాలీగా తరలివెళ్లారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. పెన్షన్ దరఖాస్తుల్లో వృద్ధాప్య పెన్షన్‌ను మినహాయించడంపై మండిపడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నిరసన అనంతరం ఎంపీడీవో కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ సుహనకు వినతి పత్రం అందజేశారు.
ఈ క్రమంలో మండల తహసీల్దార్ రవికుమార్ హాజరై, ఒంటరి మహిళ పెన్షన్ దరఖాస్తులకు సంబంధించిన విధివిధానాలను నాయకులకు వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సామినేని హరిప్రసాద్, రైతు సమన్వయ సమితి మాజీ కోఆర్డినేటర్ పోట్ల వెంకటప్రసాద్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Also Read : ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సీఎం కీలక ప్రకటన!
Follow Us On: Sharechat

