కలం, ఖమ్మం బ్యూరో: ఇంటి ముందు మూత్ర విసర్జన చేయడాన్ని ప్రశ్నించినందుకు ఓ యువకుడిని విచక్షణా రహితంగా కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసిన సంఘటన ఖమ్మం (Khammam) నగరంలో తీవ్ర కలకలం రేపింది. ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రంగనాయకుల గుట్ట (Ranganayakula Gutta) సమీపంలో జరిగిన ఈ ఘోర సంఘటన లో 24 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోగా, స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగనాయకుల గుట్ట ప్రాంతానికి చెందిన దండేటి శ్రీనాథ్ (24) అనే యువకుడు పెళ్లిళ్లకు డెకరేషన్ వర్కర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం అర్ధరాత్రి సమయంలో రంగనాయకుల గుట్ట సమీపంలో నిందితుడు వేముల మధు తన ఇంటి బయట మూత్ర విసర్జన చేస్తుండగా, శ్రీనాథ్ దానిని ప్రశ్నించాడు. దీంతో ఇద్దరి మధ్య చిన్నపాటి వివాదం చోటుచేసుకుని, అది కాస్త తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. మాటమాట పెరగడంతో ఆవేశానికి లోనైన శ్రీనాథ్ అక్కడే ఉన్న సెంట్రింగ్ కర్రతో మధు తలపై కొట్టాడు.
దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన మధు వెంటనే తన ఇంట్లోకి వెళ్లి కత్తి తీసుకువచ్చి శ్రీనాథ్‌పై విచక్షణా రహితంగా దాడి చేసి దారుణంగా పొడిచాడు. కత్తిపోట్లకు గురైన శ్రీనాథ్ రక్తమడుగులో సమీపంలోని ఒక కాలువలో పడిపోయాడు. శ్రీనాథ్ విగతజీవిగా పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, అతడిని పరీక్షించిన వైద్యులు శ్రీనాథ్ అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు.
ఘటనపై సమాచారం అందుకున్న త్రీ టౌన్ పోలీసులు తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరించారు. శ్రీనాథ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి (Khammam Hospital) మార్చురీకి తరలించారు. ఈ హత్యకు కారణమైన వేముల మధు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతడిపై కేసు నమోదు చేసి పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపడుతున్నట్లు త్రీ టౌన్ పోలీసులు వెల్లడించారు.
Also Read : ఆయిల్ కంపెనీలో ప్రభుత్వ విప్ ఆకస్మిక తనిఖీ!
Follow Us On: Instagram

