కలం, వెబ్‌డెస్క్: భారతదేశ (India) స్వాతంత్య్ర వేడుకల వేళ మువ్వన్నెల జెండా రికార్డులకెక్కింది. హర్యానా (Haryana)లోని పల్వాల్ జిల్లాలో 5 కిలో మీటర్ల మేర భారీ జాతీయ జెండా (National Flag) ను ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలో వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు. ఈ భారీ తిరంగ యాత్ర రెండు ప్రపంచ రికార్డులు సృష్టించింది. గిన్నిస్ బుక్‌తో పాటు గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. పల్వాల్‌కు చెందిన గౌరవ్ గౌతమ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వేలాది మంది ప్రజలు ఉత్సాహంగా పాల్గొని జాతీయ జెండాలతో దేశ భక్తిని చాటుకున్నారు.
ఈ వేడుకలో 5 కిలోమీటర్ల పొడవు, 10 అడుగుల వెడల్పు ఉన్న భారీ త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించారు. అతి పొడవైన జెండా సామూహిక మార్చ్, ఎక్కువ మంది జాతీయ జెండాను పట్టుకోవడం అనే రెండు విభాగాల్లో రికార్డు నమోదైంది. ఈ జాతీయ జెండా మార్చ్‌లో సుమారు 20 చోట్ల భారీ ఎత్తున ప్రజలు జెండాకు స్వాగతం పలికారు. దారి పొడవునా భారత్ మాతాకీ జై నినాదాలతో హోరెత్తించారు. మరోవైపు దేశ వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీలు కూడా ఉత్సాహంగా సాగుతున్నాయి. పల్వాల్‌లో జరిగిన మార్చ్ ఈ యాత్రలకు ప్రేరణగా మారింది.

