లంకలో టీమిండియా టెస్ట్ సమరం.. గిల్ సేనకు అగ్ని పరీక్ష

కలం, స్పోర్ట్స్ బ్యూరో: క్రికెట్ ప్రపంచంలో శ్రీలంక పర్యటన అంటేనే టీమిండియాకు ఎప్పుడూ ఓ కఠిన సవాల్. స్పిన్‌కు అనుకూలించే లంక పిచ్‌లపై పరుగుల వరద పారించడం, ప్రత్యర్థి వికెట్లు పడగొట్టడం అంత సులువు కాదు. కెప్టెన్లుగా కపిల్ దేవ్ నుంచి విరాట్ కోహ్లీ వరకు ఎందరో దిగ్గజాలు లంక గడ్డపై తమ సత్తాను పరీక్షించుకున్నారు. కొందరు కెప్టెన్లు చేదు జ్ఞాపకాలను మూటగట్టుకుంటే, మరికొందరు సరికొత్త రికార్డులతో చరిత్ర సృష్టించారు. ఇప్పుడు అదే గడ్డపై యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) నేతృత్వంలోని సరికొత్త టీమిండియా మరో సవాల్‌కు సిద్ధమైంది.

కపిల్ దేవ్ నాయకత్వంలో టీమిండియా తొలిసారిగా 1985లో లంకలో పర్యటించింది. అయితే ఆ టెస్ట్ సిరీస్‌ను ఆతిథ్య జట్టు 1-0తో కైవసం చేసుకుని షాక్ ఇచ్చింది. శ్రీలంక ఒక మ్యాచ్ గెలవగా, మరో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఆ తర్వాత లంక గడ్డపై టీమిండియాకు మొట్టమొదటి టెస్టు సిరీస్ విజయాన్ని అందించిన ఘనత మహ్మద్ అజారుద్దీన్‌కే దక్కింది. 1993లో అజహర్ నేతృత్వంలోని జట్టు అద్భుత ప్రదర్శనతో 1-0తో సిరీస్‌ను గెలుచుకుని లంకలో తొలి విజయకేతనాన్ని ఎగరేసింది.

సౌరభ్, ధోని వల్లే కాలేదు

విదేశాల్లో విజయాలకు కొత్త నమ్మకాన్ని తీసుకొచ్చిన సౌరభ్ గంగూలీ కూడా శ్రీలంకలో సిరీస్ విజయాన్ని సాధించలేకపోయాడు. 2001లో భారత్ 2-1తో సిరీస్‌ను కోల్పోయింది. 2008లో కుంబ్లే నాయకత్వంలోనూ ఇదే ఫలితం రిపీట్ అయ్యింది. శ్రీలంక 2-1తో సిరీస్‌ను గెలుచుకుంది. టీమిండియాకు రెండు ప్రపంచకప్‌లు అందించిన దిగ్గజ కెప్టెన్ ఎం.ఎస్. ధోని కూడా శ్రీలంకలో టెస్ట్ సిరీస్ విజయాన్ని అందుకోలేకపోయారు. ధోని హయాంలో 2010లో జరిగిన టెస్ట్ సిరీస్ 1-1తో డ్రాగా ముగిసింది.

రికార్డుల రారాజు కోహ్లీ

కానీ ఆ గత రికార్డులను రన్ మెషిన్ విరాట్ కోహ్లీ తిరగరాశాడు. శ్రీలంక గడ్డపై రెండు టెస్టు సిరీస్లు ముద్దాడిన ఏకైక టీమిండియా కెప్టెన్‌గా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. 2015 పర్యటనలో కోహ్లీ సేన 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకోగా.. ఆ తర్వాత 2017లో లంకను వారి సొంత గడ్డపైనే 3-0తో క్లీన్స్వీప్ చేసి సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

గిల్ సేనకు అగ్నిపరీక్ష

తొమ్మిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా మళ్లీ లంక గడ్డపై ఆగస్టు15 నుంచి టెస్టు సిరీస్ ఆడబోతున్నది. కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ వంటి దిగ్గజ సీనియర్లు టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వేళ.. కొత్త తరం ఆటగాళ్లతో కూడిన జట్టును యువ కెప్టెన్ శుభ్మన్ గిల్ (Shubman Gill) ఎలా నడిపిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ రేసులో నిలవాలంటే టీమిండియాకు ఈ టెస్టు సిరీస్ ఎంతో కీలకం.

హెడ్ టు హెడ్

ఇప్పటివరకు ఇరుజట్లు 46 టెస్టుల్లో తలపడగా, భారత్ 22 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. శ్రీలంక 7 మ్యాచ్‌ల్లో గెలిచింది. 17 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. అయితే లంక గడ్డపై మాత్రం పోటీ హోరాహోరీగానే సాగింది. అక్కడ ఆడిన 8 టెస్టు సిరీస్లో ఇరు జట్లు చెరో 3 సిరీస్‌లు గెలుచుకోగా, 2 సిరీస్‌లు డ్రాగా ముగిశాయి. దీంతో స్వదేశంలో శ్రీలంకను తక్కువ అంచనా వేయలేమని క్రికెట్ విశ్లేషకులు చెప్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>